Food

గుమ్మడి గింజలు తప్పకుండా తినాలి

గుమ్మడి గింజలు తప్పకుండా తినాలి

లాభాలు బోలెడు: గుమ్మడి విత్తనాలతో గుండె, పిత్తాశయం ఆరోగ్యంగా ఉండడంతోపాటు, కొన్ని రకాల కేన్సర్‌ల నుంచి కూడా రక్షణ పొందవచ్చు. గుమ్మడి కాయను కోసినప్పుడు కనిపించే తెల్లని విత్తనాలే మనకు తెలుసు. కానీ మార్కెట్లో తొక్క తీసిన గుమ్మడి విత్తనాలు దొరుకుతాయి. ఇవి ఆకుపచ్చ రంగులో దీర్ఘవృత్తాకారంలో, పల్చగా ఉంటాయి.

యాంటీఆక్సిడెంట్లు బోలెడు: కెరోటినాయిడ్స్‌, విటమిన్‌ ఇ మొదలైన యాంటీఆక్సిడెంట్లు వీటిలో ఉంటాయి. ప్రమాదకరమైన ఫ్రీర్యాడికల్స్‌ నుంచి రక్షించి వాపుల నుంచి కాపాడతాయి. కాబట్టే యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే విత్తనాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఎలుకల మీద జరిపిన పరిశోధనలో గుమ్మడి విత్తనాల వల్ల కీళ్ల వాపులు, నొప్పులు ఎటువంటి దుష్ప్రభావాలూ లేకుండా తగ్గినట్టు తేలింది. వాటికి బదులు యాంటీఇన్‌ఫ్లమేటరీ మందులు ఇచ్చినప్పుడు ఎలుకల్లో దుష్ప్రభావాలు కనిపించాయి.

కేన్సర్ల నుంచి రక్ష: ఉదరం, రొమ్ము, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్‌, పెద్ద పేగు కేన్సర్ల నుంచి రక్షణ పొందాలన్నా గుమ్మడి విత్తనాలు తినాలి. గుమ్మడి విత్తనాల్లో ఉండే ‘లిగ్నాన్‌’ అనే పదార్థం రొమ్ము కేన్సర్‌ నియంత్రణలో, చికిత్స సమయంలో ఎంతో మేలు చేస్తాయి. మెనోపాజ్‌ దశకు చేరుకున్న మహిళల్లో రొమ్ము కేన్సర్‌ నియంత్రణకు కూడా ఇవి ఎంతో దోహదపడతాయి. అలాగే ప్రోస్టేట్‌ కేన్సర్‌ పెరుగుదలను కూడా ఇవి నియంత్రిస్తాయి.

మూత్రాశయ ఆరోగ్యం: ప్రోస్టేట్‌ హైపర్‌ప్లేసియా అనే ప్రోస్టేట్‌ కేన్సర్‌లో కనిపించే బాధాకరమైన లక్షణాల నుంచి ఉపశమనం దక్కాలంటే ఈ విత్తనాలు తినాలి. అలాగే అతిమూత్ర సమస్య నుంచి విముక్తి పొందాలన్నా ఆహారంలో గుమ్మడి విత్తనాలు చేర్చుకోవాలి. సమాన నిష్పత్తిలోని పురుషులు, స్త్రీల మీద జరిపిన ఓ పరిశోధనలో రోజూ క్రమంతప్పకుండా ఒక చెంచా గుమ్మడి విత్తనాలు తినడం ద్వారా మూత్రవ్యవస్థ పనితీరు మెరుగయినట్టు తేలింది.

పెద్ద మొత్తంలో మెగ్నీషియం: మరే ఇతర పదార్థాల్లో లేనంత ఎక్కువ పరిమాణాల్లో మెగ్నీషియం గుమ్మడి విత్తనాల్లో ఉంటుంది. శరీరంలోని 600 రకాల రసాయన చర్యలకు మెగ్నీషియం అవసరం. సమపాళ్లలోని మెగ్నీషియం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. హృద్రోగాలు దరి చేరకుండా ఉంటాయి. ఎములక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.

గుండె పదిలం: గుండె ఆరోగ్యానికి దోహదపడే మెగ్నీషియం, జింక్‌, ఫ్యాటీ యాసిడ్లు గుమ్మడి విత్తనాల్లో అధికం. గుమ్మడి విత్తనాల నుంచి తీసిన నూనె వల్ల గుండో ఆరోగ్యానికి హానికారకమైన అధిక కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు అదుపులో ఉంటాయి. గుమ్మడి విత్తనాలు తినడం వల్ల శరీరంలో నైట్రిక్‌ ఆక్సైడ్‌ తయారై గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. నైట్రిక్‌ ఆక్సైడ్‌ రక్తనాళాలు వెడల్పయ్యేలా చేసి, గుండెకు రక్తప్రసారం సక్రమంగా జరిగేలా, రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా ఉండేలా చేస్తుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z