Agriculture

మిగ్‌జాం తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు

మిగ్‌జాం తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు

మిగ్‌జాం తీవ్ర తుపాను (Cyclone Michaung) ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.

తిరుపతి జిల్లా చిట్టేడులో అత్యధికంగా 39 సెం.మీ., నెల్లూరు జిల్లా మనుబోలులో 36.8సెం.మీ., తిరుపతి జిల్లా అల్లంపాడులో 35సెం.మీ వర్షపాతం నమోదైంది. చిల్లకూరులో 33సెం.మీ, నాయుడుపేటలో 28.7 సెం.మీ, ఎడ్గలి 24సెం.మీ, బాపట్ల 21సెం.మీ, మచిలీపట్నం 14.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో చాలా చోట్ల 10సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 24 గంటలపాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు వర్షసూచనలు ఉన్నాయి.

నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్‌ సెంటర్‌లో తుపాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకొని చర్యలు చేపట్టారు. అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలో వేలాది అరటిచెట్లు నేలకొరిగాయి. నేతివారిపల్లి, నగిరిపాడు పరిధిలో సుమారు 25వేల అరటిచెట్లు నేలకూలినట్లు రైతులు అంచనా వేస్తున్నారు.

తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లా సూర్యలంక తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చింది. అక్కడి తుపాను రక్షిత భవనంలో స్థానిక గిరిజనులకు పునరావాసం కల్పించారు. వర్షం, గాలుల తీవ్రతకు సూర్యలంక బీచ్ పోలీస్ అవుట్ పోస్ట్ కూలిపోయే స్థితిలో ఉంది. సోమవారం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి బాపట్ల పట్టణంలో రోడ్లపై వరదనీరు మోకాళ్ల లోతు వరకు చేరింది. రోడ్లపై చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

బాపట్ల మండలంలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పికట్లలో వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. భారీ వర్షాలతో బాపట్ల పరిధిలోని నల్లమడ, పేరలి కాలువలు ఉద్ధృతతంగా ప్రవహిస్తున్నాయి. కర్లపాలెంలో పచ్చిమిర్చి, కొరిసపాడులో పొగాకు పంటలు నీటమునిగాయి. కృష్ణా జిల్లా దివిసీమలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరితో పాటు ఇతర పంటలు నీట మునిగాయి. బస్తాల్లోని ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్‌ఆర్‌ జిల్లా కలసపాడు మండలంలో సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. పలు గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మండలంలోని ఎగురామాపురం ప్రాంతంలో 80 ఎకరాల్లో వ‌రి, 500 ఎకరాలపైగా మొక్కజొన్న, 80 ఎకరాలకుపైగా మిర్చి, 2వేల‌ ఎకరాలకు పైగా పొగాకు, 30ఎక‌రాల్లో ప‌సుపు, 100 ఎక‌రాల‌కు పైగా మినుము, ఉల‌వ‌ పంట‌లు దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. రూ.కోట్లలో పంటలకు న‌ష్టం వాటిల్లడంతో రైతులు తల్లడిల్లుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z