మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) ప్రభావంతో తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ (Hyderabad)తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో వర్షం పడుతోంది. హైదరాబాద్‌లోని మియాపూర్, కూకట్‌పల్లి, మూసాపేట, ఎస్‌ఆర్‌నగర్, సనత్‌నగర్, అమీర్‌పేట, ఖైరతాబాద్, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్డుపైకి వరదనీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, అశ్వారావుపేట, నేలకొండపల్లి, ఇల్లెందు, అన్నపురెడ్డిపల్లి, కల్లూరు, ఆళ్లపల్లి, సత్తుపల్లిలో వర్షం పడుతోంది. వర్షంతో ఇల్లెందు సమీపంలోని సింగరేణి ప్రాంతంలో ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
తుపాను ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల గంటకు 90కి.మీపైగా వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో చాలా చోట్ల పంటలకు తీవ్ర నష్టం జరిగింది. గంటకు 7కి.మీ వేగంతో మిగ్‌జాం తుపాను ముందుకు కదులుతోంది.
తెలంగాణ మధ్యాహ్నం ఒంటిగంట వరకు వర్షం కురిసే అవకాశం ఉన్న జిల్లాలను వాతావరణశాఖ ప్రకటించింది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్‌కర్నూలు, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వనపర్తి, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షం కొనసాగనుందని తెలిపింది.
👉 – Please join our whatsapp channel here –