DailyDose

ఇంజనీరింగ్ ఫీజుల ఖరారుపై హైకోర్టు తీర్పు

ఇంజనీరింగ్ ఫీజుల ఖరారుపై హైకోర్టు తీర్పు

ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల 2023-26 సంవత్సర శ్లాబ్‌ కాలానికి చట్ట నిబంధనల మేరకు ఫీజులను నిర్ణయించాలని ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. కళాశాల యాజమాన్యం చేసిన ఖర్చులు, పెరిగిన ధరలను పరిగణనలోకి తీసుకొని ఫీజులను ఖరారు చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు కళాశాల యాజమాన్యాలు వర్క్‌షాప్‌, గార్డెనింగ్‌ నిర్వహణ విషయంలో నిర్దిష్టంగానే ఖర్చు చేయాలంటూ శ్లాబ్‌ను విధించొద్దని తేల్చిచెప్పింది. చట్ట నిబంధనలకు భిన్నంగా ప్రైవేటు కళాశాలల ఫీజును ఖరారు చేయడం చూస్తుంటే ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంపై భారం పడకుండా కమిషన్‌ వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మంగళవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు. ఫీజుల ఖరారుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌, తదితరులు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

రాయలసీమ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌పై ఎన్‌బీడబ్ల్యూ జారీ
విచారణకు గైర్హాజరైన రాయలసీమ వర్సిటీ ఉపకులపతి(వీసీ) ఆనందరావు, రిజిస్ట్రార్‌ శ్రీనివాసులుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ (ఎన్‌బీడబ్ల్యూ) జారీచేసింది. వారిద్దరిని కోర్టు ముందు హాజరుపరచాలంటూ పోలీసులను ఆదేశిస్తూ విచారణను జనవరి 5కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. ఎంఈడీ కౌన్సెలింగ్‌కు అనుమతివ్వకపోవడాన్ని సవాలు చేస్తూ రెండు కళాశాలలు హైకోర్టును ఆశ్రయించగా.. కౌన్సెలింగ్‌కు అనుమతించాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. కోర్టు ఉత్తర్వులు అమలుకాకపోవడంతో కళాశాల యాజమాన్యం.. కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 5న తమ ముందు హాజరుకావాలని వీసీ, రిజిస్ట్రార్‌ను.. న్యాయస్థానం ఆదేశించింది. మంగళవారం విచారణకు హాజరుకాకపోవడంతో వారిపై ఎన్‌బీడబ్ల్యూ జారీచేసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z