* తుపాన్‌పై అధికారులతో జగన్ సమీక్ష
తుపాను దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై సీఎం జగన్ ఆరా తీశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, సీసీఎల్‌ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంఓ అధికారులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. దీనిలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘ బాధితులకు మంచి సదుపాయాలు అందించాలి. సౌకర్యాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు రాకుండా చూడాలి. నెల్లూరు, తిరుపతి సహా తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో కరెంటు సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. మనుషులు, పశువులు మరణించినట్టు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలి. తుపాను తగ్గిన వెంటనే ఎన్యుమరేషన్ కూడా ప్రారంభం కావాలి. గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ వ్యవస్ధలను వాడుకుని రేషన్ పంపిణీ సమర్ధవంతంగా చేపట్టాలి’ అని అధికారులకు సీఎం జగన్ సూచించార నెల్లూరు –కావలి మధ్య సగం ల్యాండ్ ఫాల్, సగం సముద్రంలో తుపాను గమనం ఉందని తెలిపిన అధికారులు.. చీరాల, బాపట్ల మధ్య పయనించి అక్కడ పూర్తిగా తీరం దాటనుందని సీఎంకు వివరించారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావం ఈ ఉదయం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతోందని, ఆ జిల్లాల్లో సహాయ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. అదే సమయంలో ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల కలెక్టర్లనూ అప్రమత్తం చేశామన్నారు. ఇప్పటివరకూ 211 సహాయ శిబిరాల్లో సుమారు 9,500 మందిని తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
* రేపు ఢిల్లీలో జరగాల్సిన మీటింగ్ వాయిదా
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘ఇండియా’ (INDIA) కూటమిలో విభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది. కూటమి తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు కాంగ్రెస్ (Congress) పార్టీ రేపు (డిసెంబర్ 6న) సమావేశానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా ఆ మీటింగ్ వాయిదా పడింది ( postponed ). ఈ సమావేశానికి కూటమిలోని పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు డుమ్మా కొట్టే యోచనలో ఉన్నట్టు ( top leaders decide to skip) వార్తలు వస్తున్న నేపథ్యంలో.. మీటింగ్ వాయిదా పడటం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.కాగా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కూటమి తదుపరి కార్యాచరణపై చర్చిచేందుకు కాంగ్రెస్ పార్టీ సమావేశానికి పిలుపునిచ్చింది. డిసెంబర్ 6వ తేదీన ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఆ మీటింగ్ గురించి తనకు తెలియదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు.దీదీ బాటలోనే మిగితా కూటమి నేతలు కూడా ఉన్నారు. సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా ఇండియా కూటమి భేటీకి డుమ్మా కొట్టనున్నారు. ఆ ఇద్దరూ తమ ప్రతినిధుల్ని భేటీకి పంపనున్నట్లు తెలుస్తోంది. బుధవారం జరిగే ఇండియా బ్లాక్ భేటీకి వెళ్లే ఆలోచనలో అఖిలేశ్ లేరని ఆ పార్టీ ప్రతినిధి రాజేంద్ర చౌదరీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రేపు ఢిల్లీలో జరగాల్సిన కూటమి సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది.
* జగన్ సర్కార్‌పై చంద్రబాబు ఆగ్రహం
తుపాను బాధితు ప్రజలకు తక్షణ అవసరం అయిన ఆహారం, నీళ్లు, షెల్టర్ ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తుపానుపై ప్రభుత్వ సన్నద్ధత లేదు… బాధితులకు సాయమూ లేదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మిచౌంగ్ తుపాను బాధిత గ్రామాలకు చెందిన కొందరు ప్రజలతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. తమకు కనీసం భోజనం కూడా పెట్టేలేదని…ప్రభుత్వ స్పందన సరిగా లేదని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు చంద్రబాబుకు చెప్పారు. తుపాను ప్రభావంపై దాదాపు 12 వేల మంది పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై నాయకులతో మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో ఉన్న నాయకుల ద్వారా పలు గ్రామాల ప్రజలతో మాట్లాడారు. వారి బాగోగులు తెలుసుకున్నారు. ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూడకుండా….పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధిత ప్రజలకు అండగా ఉండాలి అని సూచించారు. వెంటనే భోజనం, తాగునీరు అందేలా చూడాలని నేతలకు చంద్రబాబు ఆదేశించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు దేశం పార్టీ ప్రజల కోసం పని చేస్తుందని….ఈ కష్ట సమయంలో చేతనైన సాయం ద్వారా ప్రజలకు అండగా నిలవాలని అన్నారు. ఈ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నా….చేతలు గడప దాటడం లేదని చంద్రబాబు విమర్శించారు. దీనికి క్షేత్ర స్థాయి పరిస్థితులే నిదర్శనం అని మండిపడ్డారు. ఈ స్థాయి విపత్తు అని ముందే తెలిసినా…ప్రజలను అలెర్ట్ చేయడంలో విఫలం అయ్యారని… వ్యవస్థల నిర్వీర్యం వల్లనే నేడు ఈ దుస్థితి నెలకొందని చంద్రబాబు నాయుడు అన్నారు.విపత్తుల సమయంలో రైతులను ఆదుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రత్యేక జీవోలు ఇచ్చి సాయం అందించాం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. హుద్ హుద్ సమయంలో జీవో నెంబర్ 9 ద్వారా, తిత్లీ తుఫాన్ సమయంలో జీవో నెంబర్ 14 ద్వారా నష్ట పరిహారం పెంచి రైతులకు అండగా నిలబడ్డాం అని చెప్పుకొచ్చారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం లెక్కలు వేసుకోకుండా ఉదారంగా వ్యవహరించాలి. తెలుగు దేశం హయాంలో విపత్తుల సమయంలో సాయం పెంచి ఎలా ఇచ్చిందీ….వైసీపీ ప్రభుత్వం ఎలా కోతలు పెట్టిందీ అనే విషయాన్ని నేతలకు చంద్రబాబు వివరించారు. నాటితో పోల్చుకుంటే నేడు పెరిగిన సాగు ఖర్చులు, ఇతర భారాలను దృష్టిలో పెట్టుకుని పరిహారం మరింత పెంచి ఇవ్వాలి అని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు.
* ఎల్లా హోటల్‌లో రేవంత్ రెడ్డితో సీపీఐ నేతలు భేటీ
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై సందిగ్ధత కొనసాగుతోంది. కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ ఉండటంతో ఎటూ తేల్చలేక అధిష్టానం సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, తాజాగా.. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో జరిగిన కీలక సమావేశంలో సీఎం ఎంపిక అయినట్లు తెలుస్తోంది. సీల్డ్ కవర్‌లో వచ్చిన ముఖ్యమంత్రి పేరును కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు.అనంతరం సీఎల్పీ నేతనూ ఫైనల్ చేయనున్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమైన ఎల్లా హోటల్‌కు సీపీఐ నేతలు చేరుకున్నారు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, చాడా వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి తదితరులు హోటల్‌కు చేరుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డితో భేటీ అయినట్లు సమాచారం.
* సీపీఐతో పొత్తు కాంగ్రెస్ కు కలిసొచ్చింది
సీపీఐతో పొత్తు కాంగ్రెస్ కు కలిసొచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు అణిచివేతను సహించరని అన్నారు. అందుకే కేసీఆర్ ఓడిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు నిజాం ప్రజల్ని అణిచివేసే ప్రయత్నం చేస్తే పోరాటం జరిగిందని అన్నారు. తెలంగాణ ఉద్యమం కూడా అణిచివేత వల్లే పుట్టిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆందోళనలు చేసే స్వేచ్చ అయినా ఉండేది.. కేసీఆర్ పాలనలో అది కూడా లేదన్నారు.నిర్బంధాలు తెలంగాణ అంగీకరించదు అనేది మొన్నటి తీర్పు చెప్పిందని అన్నారు. ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీకి కూడా వర్తిస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. అణిచివేత లేకుండా కాంగ్రెస్ పాలన జరగాలని అన్నారు. కాంగ్రెస్ కమ్యునిస్ట్ ల పొందిక కలిసి వచ్చిందని తెలిపారు. కమ్యునిస్ట్ ప్రభావం ఉన్న ప్రతీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ గెలిచిందని అన్నారు. ఒక్కరైనా కమ్యునిస్ట్ అసెంబ్లీలో ఉండాలని ప్రజలు కోరుకున్నారని అన్నారు. నా గెలుపు అందరి సహకారం ఉందని తెలిపారు. కొత్తగూడెం సెగ్మెంట్ లో గతంలో ఎప్పుడూ రాని మెజారిటీ వచ్చిందని తెలిపారు. కమ్యునిస్ట్ గొంతును అసెంబ్లీ లో వినిపించేందుకు నా ప్రయత్నం చేస్తా అని.. భవిషత్ లో మా నిర్మాణం కు కృషి చేసుకుంటామని అన్నారు.
* ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్‌ఎస్‌పార్టీకి తీరని లోటు
ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ ఆరునెలల వ్యవధిలో ఇద్దరు ఉద్యమనేతలను కోల్పోయింది. గుండెపోటుతో.. ఆరు నెలల వ్యవధిలో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్(Kusuma Jagadish), జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి(Pagala Sampath reddy) ఇరువురు జడ్పీ చైర్మెన్లు మృత్యువాత పడటం పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఇద్దరు నేతలు కూడా సామాన్య కుటుంబాల నుంచి ఎదిగి వచ్చారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో అడుగులో అడుగు వేస్తూ అంచలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానాలకు చేరుకొని అందరి మన్ననలు పొందారు. ములుగు జిల్లాలోని మల్లంపల్లికి చెందిన జగదీశ్వర్ మొదటి నుంచి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంట ఉన్నారు.14 ఏండ్లపాటు హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్(BRS) పార్టీ కార్యాలయంలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. అతడి సేవలను గుర్తించిన కేసీఆర్ జెడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించారు.అలాగే ఉద్యమంలో ముందుండి పోరాడిన మరోనేత సంపత్‌రెడ్డి. అతడి సేవలను గుర్తించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జనగామ జడ్పీ చైర్మన్‌గా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జోడు పదవులను కట్టబెట్టారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత సోమవారం మధ్యాహ్నం స్టేషన్ ఘన్‌పూర్‌లో తొలిసారి నిర్వహించిన మీడియా సమావేశంలో సంపత్‌రెడ్డి పాల్గొని అందరితో కలివిడిగా గడిపారు.కడియం గెలుపు సంబురాల్లో పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్న ఆయన స్వీట్లు పంచి ఉత్సాహంగా కనిపించిన కొద్దిసేపటికే కానరాని లోకాలకు వెళ్లడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. పాగాల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయ నకు భార్య సుజాతారెడ్డి, కూతురు సంజనారెడ్డి ఉన్నారు. కుమారుడు సాయిరెడ్డి 2010 జూన్ 26న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సంపత్‌రెడ్డి మానసికంగా బాగా కుంగిపోయారు. భవిష్యత్తులో రాజకీయంగా ఎదిగే దశలో వీరు ఇరువురు ఉద్యమకారులు మృతి చెందడం తెలంగాణ సమాజానికి తీరని లోటు.
* 20 ఏళ్ల సెంటిమెంట్‌కు బ్రేక్
మాజీ సీఎం కేసీఆర్‌కు ఢిల్లీలోని 23, తుగ్లక్ రోడ్డులో తన అధికారిక నివాసంతో 20 ఏళ్ల అనుబంధం తెగిపోయింది. 2004లో టీఆర్ఎస్ తరఫున కరీంనగర్ నుంచి ఎంపీగా కేసీఆర్ గెలిచి మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. సెంట్రల్ మినిస్టర్ హోదాలో ఆయనకు తుగ్లక్ రోడ్డులో క్వార్టర్స్‌ను ఆనాటి ప్రభుత్వం కేటాయించింది. 2006లో కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి కేసీఆర్ రాజీనామా చేసి బై ఎలక్షన్ లో గెలిచిన తర్వాత కూడా ఇదే నివాసంలో కొనసాగారు.2009లో మహబూబ్ నగర్ ఎంపీగా, 2014లో తెలంగాణ సీఎంగా అయిన తర్వాత ఆయన అదే నివాసాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక, నిజామాబాద్ ఎంపీగా కవిత గెలిచిన తర్వాత కూడా అదే నివాసాన్ని అధికారికంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఢిల్లీ పర్యటనలకు వెళ్లిన సందర్భంగా కేసీఆర్ ఇక్కడ బస చేసేవారు. 2018లో రెండో సారి సీఎం అయిన తర్వాత కూడా ఇదే నివాసాన్ని సీఎం కేసీఆర్ కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ సీఎంగా రిజైన్ చేయగా ఢిల్లీలోని నివాసాన్ని ఖాళీ చేస్తామని రెండు రోజులు గడువు కావాలని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఢిల్లీ అధికారులకు తెలిపాయి.
* ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న ఉత్తమ్
పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు. ఇవాళ ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు.ఈ భేటీ అనంతరం లోక్ సభ స్పీకర్ ను కలిసి ఆయన తన రాజీనామా లేఖను సమర్పించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి సీఎం రేసులో ఉన్న ఆయన హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సీఎం ఎవరన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొని ఉండగా, ఈరోజు సాయంత్రం సీఎం అభ్యర్థి పేరు ప్రకటిస్తామని ఖర్గే స్పష్టం చేశారు. దీంతో ఈ సాయంత్రానికి సస్పెన్స్‌కు తెరపడనుంది.రెండు రోజుల క్రితం జరిగిన తెలంగాణ ఎన్నికల్లో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాను హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా హుజూర్ నగర్ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తానని, నల్గొండ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా తమ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడు చేస్తారనేది ఇంకా తెలియరాలేదు.
* ప్రజలు అనవసరంగా ఇంటి నుంచి బయటకు రావొద్దు
మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం చిత్తశుద్దితో పని చేస్తుంది అని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విపత్కర పరిస్దితులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాం.. ప్రతీ రెండు గంటలకు అప్ డేట్స్ తీసుకుని తీర ప్రాంత వాసులను అప్రమత్తం చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలు అవసరం లేకుండా ఇంటి నుంచి బయటకు రావొద్దు అని మంత్రి కోరారు. తీర ప్రాంతాల్లో ఇళ్లలో ఇబ్బందులు ఉంటే పునరావాస కేంద్రాలకు తరలి రావాలి.. మత్య్సకార గ్రామాలను గుర్తించి ప్రజలను తరలిస్తున్నాం.. పంట నష్టం అంచానా వేసేందుకు అధికార యంత్రాంగం పని చేస్తుంది అని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.దాదాపు 10 వేల ఎకరాల పంట నీట మునిగినట్లు సమాచారం అందుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తరఫున అన్నీ రకాల కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఇక, కొండేపి మండలం చిన్న వెంకన్నపాలెం దగ్గర మిచాంగ్ తుఫాన్ దాటికి భారీ వృక్షం నెలకొరిగింది. భారీ ఈదురు గాలులకు రోడ్డుపై అడ్డంగా భారీ వృక్షం పడింది. దీంతో కొండేపి- టంగుటూరు మధ్య రాకపోకలు అంతరాయం నెలకొన్నాయి. ఇక, భారీగా ట్రాఫిక్ నిలిచింది. తుఫాన్ కారణంగా వర్షానికి యర్రగొండపాలెం మండలం మొగుల్లపల్లిలో పలు ఇళ్లు కూలిపోయాయి. పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. పలు గ్రామాల్లో పొగాకు, మినుము, శెనగ పంట పొలాలు నీట మునిగాయి. చేతికొచ్చే దశలో పంటలు నీటి పాలు కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. రైతులకు సీఎం జగన్ అండగా ఉంటారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –