Politics

కెన్యాకు భారత్‌ 2084 కోట్ల రుణాన్ని ఇస్తున్నట్లు ప్రకటించిన మోదీ

కెన్యాకు భారత్‌ 2084 కోట్ల రుణాన్ని ఇస్తున్నట్లు ప్రకటించిన మోదీ

వ్యవసాయరంగ ఆధునికీకరణకుగాను కెన్యాకు రూ.2,084 కోట్లు (250 మిలియన్‌ డాలర్లు) సమకూర్చాలని భారత్‌ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన రుణ పరిమితి (లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌) కింద ఈ మొత్తాన్ని ఇస్తున్నట్లు వివరించారు. భారత పర్యటనలో ఉన్న కెన్యా అధ్యక్షుడు విలియం సమోయీ రూటోతో జరిపిన విస్తృత చర్చల అనంతరం ప్రధాని ఈ ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాల విస్తరణ లక్ష్యంతో మూడు రోజుల పర్యటన నిమిత్తం రూటో సోమవారం భారత్‌కు చేరుకున్నారు. ‘‘భారత్‌ తన విదేశీ విధానంలో భాగంగా ఆఫ్రికాకు ఎప్పుడూ పెద్దపీట వేస్తూ వచ్చింది. గత దశాబ్దకాలంగా ఈ బంధం మరింత పటిష్ఠమైంది. అధ్యక్షుడు రూటో పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా ఆఫ్రికాతో మన స్నేహానికి కొత్త ఊపు తెస్తుందని నేను విశ్వసిస్తున్నా’’ అని మోదీ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరుపక్షాలు అయిదు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. క్రీడలు, విద్య, డిజిటల్‌ పరిష్కారం తదితర రంగాల్లో సహకారంతోపాటు హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్రయాన ఒడంబడికపై సంయుక్త దార్శనిక పత్రాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా గతేడాది జులైలో తూర్పు ఆఫ్రికా దేశంలో కనిపించకుండాపోయిన భారతీయులు జుల్ఫికర్‌ అహ్మద్‌ఖాన్‌, జైద్‌ సమీ కిద్వాయ్‌ల గురించి ఈ చర్చల్లో భారత్‌ ఆరా తీసింది. వీరిద్దరూ అపహరణకు గురైనట్లు వార్తలు వచ్చాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z