Business

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు-వాణిజ్య వార్తలు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు-వాణిజ్య వార్తలు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీ రికార్డు గరిష్ఠ ముగింపును నమోదు చేశాయి. ఉదయం లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. అమ్మకాల సెగతో ఇంట్రాడే గరిష్ఠాల నుంచి కిందకు దిగొచ్చినప్పటికీ.. తిరిగి పుంజుకున్నాయి. వరుసగా ఆరో సెషన్‌లోనూ లాభాలను నమోదు చేశాయి. బీఎస్‌ఈ నమోదిత సంస్థల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2.5 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ.350 లక్షల కోట్ల మార్క్‌ దాటింది.సెన్సెక్స్‌ (Sensex) ఉదయం 69,168.53 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 69,381.31 దగ్గర సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 431.02 పాయింట్ల లాభంతో 69,296.14 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ (Nifty) 20,808.90 దగ్గర ట్రేడింగ్ ప్రారంభించి ఇంట్రాడేలో 20,864.05 దగ్గర రికార్డు స్థాయికి వెళ్లింది. చివరకు 168.30 పాయింట్లు పెరిగి 20,855.10 దగ్గర స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.37 దగ్గర నిలిచింది.సెన్సెక్స్‌-30 సూచీలో 20 షేర్లు లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, టైటన్‌, మారుతీ కంపెనీలకు చెందిన షేర్లు లాభపడ్డ జాబితాలో ఉన్నాయి. హెచ్‌యూఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐటీసీ, టెక్‌ మహీంద్రా, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిశాయి.గతకొన్ని రోజులుగా దూసుకెళ్తున్న అదానీ గ్రూప్‌ నమోదిత కంపెనీల షేర్లు నేడు కూడా రాణించాయి. ‘అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌’ షేరు బీఎస్‌ఈలో 20 శాతం పెరిగి రూ.1,082.60 దగ్గర అప్పర్‌ సర్క్యూట్‌ని తాకాయి. ‘అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌’ స్టాక్‌ కూడా 20 శాతం పుంజుకొని రూ.1,348 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను అందుకుంది. గ్రూపులోని ప్రధాన కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 17.03 శాతం లాభపడి రూ.2,960.10 దగ్గర స్థిరపడింది.

టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా షాకింగ్‌ నిర్ణయం

టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియా రెండు డేటా సెంటర్లను షట్‌డౌన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో ఎయిరిండియా ఏడాదికి వన్‌ మిలియన్‌ డాలర్లను ఆదా చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎయిరిండియా తన కష్టమర్లకు సేవలంచేలా  అప్లికేషన్లు, ఇతర సర్వీసులు కోసం ముంబై, న్యూఢిల్లీలలో రెండు డేటా సెంటర్లను ఉపయోగిస్తుంది. అయితే, తాజాగా వాటిని షట్‌డౌన్‌ చేస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఈ నిర్ణయంతో వన్‌ బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు ఆదా చేయొచ్చని ఎయిరిండియా చెబుతుంది. ఎయిరిండియా కార్యకలాపాలు కొనసాగించేందుకు క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఉపయోగించనుంది. ఈ క్లౌడ్‌ సేవల్ని అమెరికాలోని సిలీకాన్‌ వ్యాలీతో పాటు పాటు భారత్‌లోని గురుగ్రామ్, కొచ్చి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా “మేం ఎయిరిండియా ప్రయాణంలో సాఫ్ట్‌వేర్-ఎ-సర్వీస్, ప్లాట్‌ఫారమ్-యాజ్-ఎ-సర్వీస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్-ఎ-సర్వీస్ మెథడాలజీ  సేవల్ని వినియోగిస్తున్నాం ” అని ఎయిర్ ఇండియా చీఫ్ డిజిటల్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ సత్య రామస్వామి చెప్పారు. గతేడాది జనవరిలో టాటా గ్రూప్ టేకోవర్ చేసిన ఎయిరిండియా రానున్న ఐదేళ్ల భవిష్యాత్‌ ఎలా ఉండాలనే అంశంపై ప్రణాళికల్ని సైతం సిద్ధం చేసుకున్నట్లు రామస్వామి వెల్లడించారు.

* 6,699కే టెక్నో కొత్త మొబైల్‌

చైనా మొబైల్‌ తయారీ కంపెనీ టెక్నో (Tecno Mobiles) కొత్త స్మార్ట్‌ఫోన్‌ని భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. ఈ ఏడాదిలోనే టెక్నో స్పార్క్‌ గో 2023ని లాంచ్‌ చేసిన కంపెనీ ఇప్పుడు అదే సిరీస్‌లో మరో ఫోన్‌ను తీసుకొచ్చింది. టెక్నో స్పార్క్‌ గో 2024 (Tecno Spark Go 2024) పేరిట ఈ మొబైల్‌ని విడుదల చేసింది. 5,000mAh బ్యాటరీతో తక్కువ ధరలో లాంచ్‌ అయిన ఈ మొబైల్ ఫీచర్లపై ఓ లుక్కేయండి.టెక్నో స్పార్క్‌ గో 2024 (Tecno Spark Go 2024) మూడు వేరింట్లలో లభిస్తుంది. 3జీబీ+64జీబీ వేరియంట్‌ ధర రూ.6,699గా కంపెనీ నిర్ణయించింది. అయితే 8జీబీ+64జీబీ వేరియంట్‌, 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధరల్ని ఇంకా వెల్లడించలేదు. గ్రావిటీ బ్లాక్‌, మిస్ట్రీ వైట్‌ రెండు రంగుల్లో లభిస్తుంది. డిసెంబరు 7 నుంచి వీటి విక్రయాలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. అమెజాన్‌తో పాటూ ఇతర రిటైల్‌ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది.ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఈ మొబైల్‌ 6.56 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్‌ డిస్‌ప్లేతో వస్తోంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత హెచ్‌ఐఓఎస్‌తో పనిచేస్తుంది. పాండా స్క్రీన్‌ ప్రొటెక్షన్‌తో డిస్‌ప్లేతో దీన్ని తీసుకొచ్చారు. ఇందులో ఆక్టాకోర్‌ యూనిసోక్‌ T606 ప్రాసెసర్‌ అమర్చారు. ఫోన్‌ వెనక 13ఎంపీ ప్రధాన కెమెరా డ్యుయల్‌ ఫ్లాష్‌లైట్‌, ఏఐ లెన్స్‌ ఇచ్చారు. వీడియోకాల్స్‌, సెల్ఫీ కోసం ముందువైపు 8 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5,000mAh బ్యాటరీ, డీటీఎస్‌ సౌండ్‌ టెక్నాలజీతో డ్యుయల్‌ స్టీరియో స్పీకర్ల సదుపాయంతో ఈ మొబైల్‌ వస్తోంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.20 వేల తగ్గింపు

ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ ఓలా తన S1 X+ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తుంది. ఈ నెలతో 2023కు ముగింపు పలకనున్న నేపథ్యంలో ఇయర్ ఎండ్ ఆఫర్‌లో భాగంగా ఈ డిస్కౌంట్‌ను అందిస్తుంది. ఈ ఆఫర్ 31 డిసెంబర్ 2023 వరకు చెల్లుబాటులో ఉంటుంది. Ola S1 X+ అసలు ధర రూ.1,09,999. కానీ ఇది రూ. 89,999కే అందుబాటులో ఉంది. ఇయర్-ఎండ్ స్కీమ్ కాకుండా, కంపెనీ తన ఈ-స్కూటర్‌లకు ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌లపై రూ. 5,000 వరకు తగ్గింపు, డౌన్ పేమెంట్, జీరో ప్రాసెసింగ్ ఫీజు, 6.99 శాతం అతి తక్కువ వడ్డీ రేటుతో ఫైనాన్సింగ్ వంటి ఎంపికలను అందిస్తోంది.Ola S1 X+ ఎలక్ట్రిక్ స్కూటర్‌ 3kWh బ్యాటరీతో వస్తుంది. దీనికి 500W పోర్టబుల్ చార్జర్‌‌ను అందించారు. దీంతో బ్యాటరీని 7.4 గంటల్లో చార్జ్ చేయవచ్చు. ఒక్క చార్జింగ్‌తో 151 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. ఎకో మోడ్‌లో 125 కి.మీ. సాధారణ మోడ్‌లో 100 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలో 0 – 40 కి.మీ వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్టం వేగం 90 kmph. దీనిలో 5-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ అన్‌లాక్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

త్వరలో మైక్రోసాఫ్ట్‌ ఐడీసీ సంచలన ప్రాజెక్ట్‌లు

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ‍ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు సేవలందించే కంపెనీలు చాలా ఉన్నాయి. కానీ వాటిలో ప్రాంతీయంగా స్థానిక భాషలో సేవలందించే కంపెనీలు కొన్నే ఉంటాయి.అందులో భాగంగా ప్రపంచ దిగ్గజ టెక్‌ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ దేశంలో ప్రతిఒక్కరికి సాఫ్ట్‌వేర్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని హైదరాబాద్‌లో ఇండియన్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌(ఐడీసీ)ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కంపెనీ ఐడీసీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని క్యాంపస్‌లో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ రాజీవ్‌కుమార్‌ కేక్‌ కట్‌చేసి మాట్లాడారు. భారతదేశంలో ప్రాంతీయ భాషల్లో సాఫ్ట్‌వేర్‌ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని మైక్రోసాఫ్ట్‌ 1998లో ఇండియా డెవలప్‌మెంట్‌ సెంటర్‌(ఐడీసీ)ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని ఐడీసీ సెంటర్‌ రెడ్‌మండ్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయం తర్వాత రెండో అతిపెద్ద రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రంగా ఉంది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, నోయిడా బ్రాంచిల్లో కంపెనీ ఐడీసీ ద్వారా సేవలందిస్తోంది. ఇందులో నిపుణులైన ఇంజినీర్లు, డిజైనర్లు, పరిశోధకులు పనిచేస్తున్నారు. వినియోగదారుల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులు రూపొందిస్తున్నారు. దేశంలోని విభిన్న సంప్రదాయాలు, భాషలు ఉండడంతో అందరూ ఇంగ్లిష్‌ వినియోగించడం కష్టం అవుతోంది. దాంతో ఎన్నో ఉపయోగకరమైన సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులు అందరికీ చేరువకావడంలేదు. అయితే స్థానికంగా దేశంలోని అందరికీ అలాంటి సాఫ్ట్‌వేర్‌ సేవలు అందుబాటులో ఉండాలని మైక్రోసాఫ్ట్‌ భావిస్తోంది. అందులో భాగంగానే ఐడీసీను ప్రారంభించాం. ఇప్పటికీ 25 ఏళ్ల నుంచి సేవలందిస్తున్నాం. కంపెనీ ఇటీవల ‘మైక్రోసాఫ్ట్‌ 365’ అనే యాప్‌ను ప్రారంభించింది. అందులో ఏదైనా ఇమేజ్‌ రూపంలో ఉన్న టెక్ట్స్‌ను ఫొటో తీస్తే అది పూర్తిగా టెక్ట్స్‌ ఫార్మాట్‌లో మారిపోయి మనం ఎంపిక చేసిన భాషలోకి ట్రాన్స్‌లేట్‌ అవుతుంది. స్మార్ట్‌ఫోన్‌ కలిగి ఉన్న ప్రతిఒక్కరూ వారి ప్రాంతీయ భాషలో సమాచారాన్ని తెలుసుకునే వీలుంది. ఇండస్ట్రీలో కొన్ని కంపెనీలు ఇలాంటి సేవలు అందిస్తున్నా.. సైబర్‌ దాడుల నేపథ్యంలో ఎన్ని కంపెనీలు వినియోగదారుల డేటాకు సెక్యూరిటీ కల్పిస్తాయో ప్రశ్నార్థకమే. కానీ మైక్రోసాఫ్ట్‌ వినియోగదారుల డేటా ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఇలాంటి యాప్‌ల వల్ల చదువురాని స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు కూడా ఎంతో సమాచారం తెలుసుకోవచ్చు’ అని చెప్పారు.ప్రతిష్టాత్మక ఐడీసీ ప్రాజెక్ట్‌లపై ఆయన స్పందిస్తూ ‘జుగల్‌బంది అనే కోపైలట్‌ టూల్‌ ద్వారా ఇంగ్లిష్‌ను ప్రాంతీయ భాషల్లోకి ట్రాన్స్‌లేట్‌ చేసి వాయిస్‌రూపంలో అందించేలా మైక్రోసాఫ్ట్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతి రైతుకు అది ఎంతో ఉపయోగపడుతుంది. అందులో ప్రభుత్వ పథకాలు, అర్హతలు, ప్రయోజనాలకు సంబంధించిన సమాచారాన్ని మనకు కావాల్సిన భాషలో పొందవచ్చు. దాంతో చదువురానివారికి సైతం పథకాలపై అవగాహన అందించేలా కంపెనీ కృషి చేస్తోంది. ప్రస్తుతం తెలుగుతో సహా దేశంలోని 10 భాషల్లో దీన్ని అభివృద్ధి చేశాం. త్వరలో 22 ప్రాంతీయ భాషలకు విస్తరిస్తాం. ఈ టూల్‌కోసం మైక్రోసాఫ్ట్‌ అజూర్‌ ఓపెన్‌ఏఐను వినియోగిస్తున్నాం. త్వరలో ‘భాషిణి’ అనే చాట్‌బాట్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నాం. దీని ద్వారా నేరుగా మనకు తెలిసిన భాషలో సందేహాలు అడిగితే జనరేటివ్‌ ఏఐ సహాయంతో అందుకు అనువుగా సమాధానాలు చెబుతుంది’ అని రాజీవ్‌కుమార్‌ వివరించారు. కంపెనీ ఉద్యోగుల కృషితోనే ఇదంతా సాధ్యమవుతోందని ఆయన చెప్పారు. మైక్రోసాఫ్ట్ ఐడీసీ మైక్రోసాఫ్ట్ 365తోపాటు జుగల్‌బందీ, అజూర్ స్పెషలైజ్డ్‌ ఏఐ సూపర్‌కంప్యూటర్‌ను ఆవిష్కరించింది. విండోస్ 11లో వాయిస్ యాక్సెస్ ఫీచర్‌ను డెవలప్‌ చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌

 భారత్‌ 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ‘ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌’ అంచనా వేసింది. 2023- 24లో దేశ జీడీపీ వృద్ధి 6.4 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే ఏడాది ఇది 6.9 శాతానికి, 2026-27 నాటికి ఏడు శాతానికి చేరుతుందని లెక్కగట్టింది. ఈ క్రమంలో 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ (Indian Economy) నిలుస్తుందని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఓ నివేదికను విడుదల చేసింది.వచ్చే మూడేళ్లలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా నిలుస్తుందని ఎస్‌అండ్‌పీ తెలిపింది. ప్రస్తుతం మన దేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. మన కంటే ముందు అమెరికా, చైనా, జర్మనీ, జపాన్‌ ఉన్నాయి. అతిపెద్ద తయారీ కేంద్రంగా నిలవడమే ఇప్పుడు భారత్‌ ముందున్న సవాల్‌ అని ఎస్‌అండ్‌పీ చెప్పింది. ఇది దేశానికి ఒక పెద్ద అవకాశమని పేర్కొంది.సేవల ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి భారత్‌ను తయారీ కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఉందని ఎస్‌అండ్‌పీ నివేదిక అభిప్రాయపడింది. దీనికి బలమైన లాజిస్టిక్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ అవసరమని పేర్కొంది. మరోవైపు భారత శ్రామిక వ్యవస్థ పూర్తి సామర్థ్యాన్ని ఇంకా వెలికితీయాల్సి ఉందని వెల్లడించింది. అందుకోసం కార్మికులు, ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపర్చాలని సూచించింది. మహిళా భాగస్వామ్యాన్ని పెంచాలని తెలిపింది.వృద్ధి చెందుతున్న దేశీయ డిజిటల్ మార్కెట్.. రాబోయే దశాబ్ద కాలంలో భారతదేశ స్టార్టప్‌ వ్యవస్థ విస్తరణకు ఉపకరిస్తుందని ఎస్‌అండ్‌పీ పేర్కొంది. ముఖ్యంగా ఆర్థిక, వినియోగదారు ఆధారిత సాంకేతికతల వృద్ధికి ఇది దోహదం చేస్తుందని చెప్పింది. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఆవిష్కరణల నేపథ్యంలో దేశ వాహన రంగం వృద్ధి దశలో ఉందని తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z