అమెరికాలో అతిపెద్దదిగా, ప్రముఖమైనదిగా ప్రసిద్ధిగాంచిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 2023 ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి చతుర్ముఖ పోటీ నెలకొంది.
సహజంగా తానాలో క్రిందిస్థాయి నామినేటడ్ పదవుల నుండి ప్రారంభించి, కార్యవర్గం, ఫౌండేషన్లలో పలు పదవులు నిర్వహించి, అనుభవం గడించి, కార్యదర్శి పదవి చేపట్టిన వ్యక్తి ఏకగ్రీవంగా సంస్థతో తనకున్న అనుభవానికి అభిముఖంగా అధ్యక్ష పదవిని చేపట్టేవారు.
గత దశాబ్దన్నర కాలంలో ఈ ఏకగ్రీవ పోకడలకు తానా నీళ్లు వదిలేసింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల నిర్వహణకు తెరలేపారు. కలెక్షన్ వీరుల ప్రతిభా ప్రదర్శన మూలంగా, నిజాయితీపరులైన ఓటర్ల మూలంగా ద్విముఖ, త్రిముఖ పోటీగా జరిగిన ఆయా ఎన్నికల్లో సమర్థ నాయకులు సత్తా చాటి గెలుపొందారు. అయితే ఆ ఎన్నికల పద్ధతికి కూడా సుస్తీ చేసి తానా అధ్యక్ష పదవి ఏకగ్రీవాలు ఈ ఏడాది మధ్యలో తిరిగి నాలుగు గోడల మధ్యనకు వచ్చి చేరాయి. సౌభ్రాతృత్వ నగరంగా (The city of brotherly love) పేరుగాంచిన ఫిలడెల్ఫియాలో జరిగిన పదవుల వడ్డనలో తానా నేతల మధ్యన సోదరభావం కొరవడిన కారణంగా కోర్టు ఆదేశాలతో ఈ దఫా జరుగుతున్న చతుర్ముఖ పోరులో తానా అధ్యక్ష పీఠం తన తదుపరి నాయకుడి కోసం ఎదురుచూస్తోంది.
తానాలో అలుపెరుగని అధ్యక్ష అభ్యర్థి గోగినేని శ్రీనివాస (డెట్రాయిట్), బోణీ కొడుతున్న డా. నల్లూరి ప్రసాద్ (హ్యూస్టన్), ప్రస్తుత కార్యదర్శి వేమూరి సతీష్ (బే-ఏరియా), గత ఎన్నికల్లో ఓటమి చవిచూసి…కోర్టు ఆదేశాలకు పూర్వం వరకు 2023 కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా (EVP) వ్యవహరించిన ఉన్నత విద్యావంతుడు డా. కొడాలి నరేన్‌లు ఈ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీలో అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ మేరకు 2023 తానా ఎన్నికల సంఘం తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
ఈ నలుగురూ తమను గెలిపిస్తే తానా పీఠం నాలుగు కాళ్లను మరింత బలోపేతం చేస్తామని, సేవా కార్యక్రమాలను విస్తరిస్తామని, పారదర్శకతకు పెద్దపీట వేస్తామని తమ తమ స్థాయిలో ప్రచారాన్ని జోరెక్కిస్తున్నారు. ఆన్‌లైన్ పద్ధతిలో తొలిసారిగా జరగనున్న 2023 అధ్యక్ష ఎన్నికల్లో తానా పీఠాన్ని ఎక్కే మేటి వ్యక్తిని నిర్ణయించేది ఓటరు చేతిలోనే మీట మాత్రమే! — సుందరసుందరి(sundarasundari@aol.com)
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z