Business

ఇప్పటివరకు ఎన్ని నిధులు కేటాయించారు?

ఇప్పటివరకు ఎన్ని నిధులు కేటాయించారు?

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి అవసరమైన భూమిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటివరకూ ఇవ్వలేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. దక్షిణకోస్తా రైల్వేజోన్‌ను అధికారికంగా ప్రారంభించే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? జోనల్‌ప్రధాన కార్యాలయ నిర్మాణం ఎప్పటినుంచి ప్రారంభమైంది? ఎప్పటికి పూర్తవుతుంది? నిర్మాణం పూర్తిచేయడానికి ఎన్నిరోజులు పొడిగించారు? ఇప్పటివరకు ఎన్ని నిధులు కేటాయించారు? ఎంత ఉపయోగించారు? అని లోక్‌సభలో తెదేపా ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు బుధవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

‘‘దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు సంబంధించిన డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) తయారైంది. రూ.106.89 కోట్ల అంచనా వ్యయంతో జోనల్‌ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులను మంజూరుచేశాం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇందుకోసం రూ.10 కోట్లు కేటాయించాం. భూసర్వే, జోన్‌ ప్రధాన కార్యాలయ సముదాయం, రెసిడెన్షియల్‌కాలనీ, ఇతర నిర్మాణాలకు అవసరమైన లే అవుట్‌ ప్లాన్‌ తయారీ బాధ్యతలను తూర్పుకోస్తా రైల్వేజోన్‌కు అప్పగించాం. ముడసర్లోవలోని 52.2 ఎకరాల భూమిలో ఈ జోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మించాలని డీపీఆర్‌లో ప్రతిపాదించాం. బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం (బీఆర్‌టీఎస్‌)కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైల్వే భూమి తీసుకున్నందున దానికి బదులుగా ముడసర్లోవలో 52.2 ఎకరాల భూమిని గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైల్వేకు అప్పగించాల్సి ఉంది. ఇందుకు అనువైన భూమిని ప్రభుత్వం ఇంకా గుర్తించి, రైల్వేశాఖకు అప్పగించాల్సి ఉంది’’ అని అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. విశాఖపట్నం జంక్షన్‌-గోపాలపట్నం మధ్య 15.31 కిలోమీటర్ల మేర రూ.159.47 కోట్లతో 3, 4 లైన్ల నిర్మాణం కోసం 2023 ఏప్రిల్‌లో అనుమతులు మంజూరుచేసినట్లు రైల్వే మంత్రి వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z