NRI-NRT

యునెస్కోలో పాకిస్తాన్ ఆధిపత్యం!

యునెస్కోలో పాకిస్తాన్ ఆధిపత్యం!

అలీనోద్యమ సారథుల్లో ఒకటైన భారత్‌ చిరకాలం నుంచీ ప్రపంచవేదికపై వర్ధమాన దేశాల వాణిగా నిలుస్తోంది. అయినా, యునెస్కో(UNESCO) ఉపాధ్యక్ష పదవికి జరిగిన తాజా ఎన్నికల్లో పాకిస్థాన్‌ చేతిలో భారత్‌ ఓటమి చవిచూడటం అందర్నీ విస్తుపోయేలా చేసింది.

ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాల్లోని వర్ధమాన దేశాలు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల్లో భారత్‌(India) ప్రాతినిధ్యానికి మొదటినుంచీ మద్దతు ఇస్తూ వస్తున్నాయి. మొత్తం 58 సభ్యదేశాలున్న ఐరాస విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) కార్యనిర్వాహక మండలి ఉపాధ్యక్ష పదవికి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఇందులో పాకిస్థాన్‌(Pakistan) 38 ఓట్లు సాధించింది. భారత్‌ కేవలం 18 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది!

2023-25 కాలానికి ఇస్లామాబాద్‌ ఈ పదవి నిర్వహిస్తుంది. దీనికి కొద్దిరోజుల ముందు యునెస్కో కార్యనిర్వాహక బోర్డు సభ్యత్వానికి పాక్‌ మళ్ళీ ఎన్నికైంది. తమ అభ్యర్థిత్వానికి ఆసియా-పసిఫిక్‌ గ్రూపు దేశాల నుంచి అపారమైన మద్దతు లభించడంవల్లే ఈ విజయం సాధ్యపడిందని పాకిస్థాన్‌ విదేశాంగశాఖ ఎక్స్‌ (ట్విటర్‌)లో వ్యాఖ్యానించింది.

యునెస్కోకు అధ్యక్షుడు, ఆరుగురు ఉపాధ్యక్షులు ఉంటారు. ఆసియా-పసిఫిక్‌లో చైనా దూకుడును అడ్డుకోవడానికి అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలతో భారత్‌ చేతులు కలిపి ఇండో-పసిఫిక్‌ చతుర్భుజ కూటమిగా ఏర్పడింది. కానీ, ఆసియా-పసిఫిక్‌ దేశాలు చైనా మిత్రదేశమైన పాకిస్థాన్‌కు యునెస్కోలో వత్తాసు పలకడం భారత విదేశాంగ విధానానికి ఎదురుదెబ్బే! భారత్‌కు ప్రధానంగా పాశ్చాత్య దేశాల నుంచి మద్దతు లభించింది. యునెస్కో ఉపాధ్యక్ష ఎన్నికలో గెలవడానికి భారత శాశ్వత ప్రతినిధి విశాల్‌ శర్మ గట్టి ప్రయత్నాలు చేయకుండా యథాలాపంగా వ్యవహరించడమే ఈ ఓటమికి కారణమంటున్నారు. సాధారణంగా యునెస్కోలో భారత శాశ్వత ప్రతినిధిగా ఐఎఫ్‌ఎస్‌, ఐఏఎస్‌ అధికారులను నియమిస్తారు. కానీ, 2020 అక్టోబరులో సీనియర్‌ అధికారికి బదులు రాజకీయ ప్రతినిధి అయిన విశాల్‌ శర్మను నియమించారు. మూడేళ్లపాటు ఉండే ఈ పదవీ కాలాన్ని నెల రోజుల ముందు మరో సంవత్సరం పొడిగించారు. శర్మ గుజరాత్‌లో నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రత్యేక విధుల అధికారి (ఓఎస్‌డీ)గా వ్యవహరించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హాలోగ్రామ్‌ రూపంలో బహిరంగ సభల్లో ప్రసంగించడానికి కమ్యూనికేషన్ల నిపుణుడైన శర్మ ఏర్పాట్లు చేసేవారు. కేంద్రంలో ఎన్డీయే సర్కారు కొలువుదీరిన తరవాత శర్మను 2017లో ప్రభుత్వరంగ చమురు సంస్థ బీపీసీఎల్‌ స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించారు. ఒక్క శర్మ తప్ప, అంతర్జాతీయ సంస్థల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నవారంతా విదేశాంగ వ్యవహారాల్లో విశేష అనుభవమున్న అధికారులే. దౌత్య వ్యవహారాల్లో శర్మ అనుభవరాహిత్యమే యునెస్కో ఎన్నికల్లో భారత్‌ ఓటమికి కారణమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విశాల్‌ శర్మ మాత్రం యునెస్కోలో తన పూర్వ విజయాల గురించి చెప్పుకొస్తున్నారు. 1966 తరవాత తొలిసారిగా భారత్‌ తన హయాములోనే యునెస్కో ఆర్థిక, పాలనా వ్యవహారాల కమిషన్‌ ఛైర్మన్‌గా ఎన్నికైందని; ప్రపంచ హెరిటేజ్‌ కమిటీ ఎన్నికల్లో చైనా, జపాన్‌లకన్నా ఇండియాకే ఎక్కువ ఓట్లు లభించాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలోని రామప్ప ఆలయం, గుజరాత్‌లోని ధోలవీర, పశ్చిమ్‌ బెంగాల్‌లోని శాంతినికేతన్‌, కర్ణాటకలోని హొయసళేశ్వర ఆలయాలను ప్రపంచ వారసత్వ సంపదల పట్టికలో చేర్చామని శర్మ ఉద్ఘాటించారు. సాధారణంగా ఐరాస అనుబంధ సంస్థల ఎన్నికల్లో ఏకాభిప్రాయంతోనే ప్రతినిధులను ఎన్నుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా కుదరనప్పుడు- సంబంధిత పదవికి ఉండే ప్రాధాన్యాన్ని బట్టి పోటీ చేయాలా, వద్దా అనేది తేల్చుకుంటారు. ఒకవేళ పోటీ చేయాలనే నిర్ణయించుకుంటే, భారత ప్రతినిధులు ఇతర దేశాల ప్రతినిధులతో సంప్రతింపులు జరిపి మద్దతు చూరగొనేందుకు ప్రయత్నిస్తారు. ఫలానా పదవికి పోటీ రాకుంటే, మరో పదవికి జరిగే ఎన్నికల్లో మద్దతు ఇస్తామని బేరసారాలు జరుపుతారు. ఇదంతా అనుభవమున్న దౌత్యవేత్తలు చేసే పని. గత ఏప్రిల్‌లో ఐరాస గణాంక కమిషన్‌లో ఆసియా-పసిఫిక్‌ దేశాలకు కేటాయించిన రెండు సీట్లలో ఒకదానికి చైనా, దక్షిణ కొరియా, యూఏఈల నుంచి భారత్‌కు తీవ్ర పోటీ ఎదురైంది. దాన్ని అధిగమించి ఇండియా నెగ్గిందంటే కారణం- అనుభవజ్ఞులైన మన దౌత్యవేత్తల వ్యూహమే! ఐరాస సాంస్కృతిక సంస్థల పదవులను ప్రతీకాత్మకంగా పరిగణిస్తారు. కాబట్టి, సాధారణంగా వాటికి ఎన్నిక లేకుండానే నియామకాలు చేపట్టాలని చూస్తారు. అటువంటిది యునెస్కో ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక జరిగిందంటే రాజకీయ కారణాలతో నియమితులైన విశాల్‌ శర్మకు ముందుచూపు, సరైన వ్యూహం కొరవడ్డాయనే భావించాల్సి వస్తోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z