షారుక్ ఖాన్ (Shah Rukh Khan), విక్కీ కౌశల్ (Vicky Kaushal), తాప్సీ (Taapsee Pannu) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డంకీ’ (Dunki). రాజ్‌కుమార్ హిరాణీ దర్శకుడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని షారుక్ తాజాగా ట్విటర్ చాట్ నిర్వహించారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారిలా..!
‘దిల్‌వాలే దుల్హానియా లేజాయెంగే’లో షారుక్ రన్ చేస్తున్న వీడియోకి ‘డంకీ’లో షారుక్ రన్ చేస్తున్న ఓ సీన్‌ను కలిపి చేసిన వీడియో షేర్ చేస్తూ.. ఇలాంటి ఎడిట్స్ చూసినప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది?
షారుక్: జీవితం ఒక పరుగుపందెం లాంటిది. 11 సర్జరీల తర్వాత కూడా అంతే యాక్టివ్‌గా పరుగెడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నా.
‘డంకీ’ చిత్రానికి ఈ విధమైన ప్రమోషన్ అవసరమా?
షారుక్: ప్రమోషన్ కాదు.. నా ప్రతి చిత్రానికీ మీ ప్రేమాభిమానాలు ఎంతో అవసరం.
‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాల్లో లేనిది.. ‘డంకీ’ సినిమాలో ఉన్నది ఏమిటి?
షారుక్: చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ. అలాగే, మన కుటుంబ సభ్యుల్లో కనిపించే కొన్ని అందమైన పాత్రలు ఈ సినిమాలో ఉన్నాయి.
ఈ చిత్రాన్ని కుటుంబంతో కలిసి చూడొచ్చా?
షారుక్: మై ఫ్రెండ్.. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరితో కలిసి ఈ సినిమా చూడొచ్చు. సెలవు రోజున కుటుంబ సభ్యులందరినీ సినిమాకు తీసుకెళ్లండి.
సినీ కెరీర్‌లో ఇప్పటివరకూ మీరు నేర్చుకున్న జీవితపాఠం ఏమిటి?
షారుక్: మీ కుటుంబం, స్నేహితులకు మించి అందమైనది మరొకటి ఉండదు.
మీ నుంచి కొన్ని పంజాబీ డైలాగ్స్ కోరుకుంటున్నాం?
షారుక్: నాకు పంజాబీ మాట్లాడటం అంతగా రాదు. అందుకే, ఆ బాధ్యతను తాప్సీ, విక్కీకి వదిలేశా. వాళ్లు అద్భుతంగా మాట్లాడతారు.
‘డంకీ’ అంటే అసలు అర్థం ఏమిటి?
షారుక్: దేశ సరిహద్దులగుండా అక్రమంగా ప్రయాణించడాన్ని డాంకీ జర్నీ అంటారు. పంజాబీ వాళ్లు దానిని ‘డంకీ’ అని పిలుస్తుంటారు.
ఈ సినిమాలో ఏదైనా రొమాంటిక్ సాంగ్ ఉందా?
షారుక్: ఎస్. నా సినిమాలో రొమాంటిక్ సాంగ్ లేకపోవడమంటే.. మనసు ఉండి గుండెచప్పుడు లేకపోవడంతోనే లెక్క.
(ది ఆర్చీస్ ప్రీమియర్ షో ఈవెంట్ ఫొటో షేర్ చేస్తూ..) కాజోల్ అంతలా నవ్వుతున్నారు. ఇంతకీ ఏం జోక్ చేశారు?
షారుక్: ఇంట్లో క్రిస్మస్ చేసుకుంటున్నానని.. కాబట్టి బహుమతులు పంపించడం మర్చిపోవద్దని చెప్పా. ఆమె ప్రతి ఏడాది పంపిస్తుంది. కాకపోతే, ఈ ఏడాది కాస్త ఖరీదైన బహుమతి పంపించమని చెప్పా.
‘ది ఆర్చీస్’తో సుహానా వెండితెరకు ఎంట్రీ ఇవ్వడంపై మీ ఫీలింగ్ ఏమిటి?
షారుక్: పిల్లలు ఎదిగి.. కెరీర్‌లో తొలి అడుగువేయడం తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.
పీఆర్ టీమ్ సరిగ్గా వర్క్ చేయడం వల్లే ఇటీవల మీరు నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమా కూడా అలాగే విజయాన్ని అందుకుంటుందని భావిస్తున్నారా?
షారుక్: మామూలుగా మీలాంటి తెలివైన వాళ్లకు నేను రిప్లై ఇవ్వను. కాకపోతే మీ విషయంలో కాస్త వెసులుబాటు కల్పించా. ఎందుకంటే మీరు మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే, మీకు మంచి మందులు పంపించమని మా పీఆర్ టీమ్‌కు చెబుతా. మీరు త్వరలోనే కోలుకుంటారని భావిస్తున్నా.
‘ది ఆర్చీస్’ ప్రీమియర్‌లో సుహానాతో కలిసి నడుస్తోన్న ఫొటోని షేర్ చేస్తూ.. ఆ సమయంలో మీ ఫీలింగ్ ఏమిటి?
షారుక్: ఆ క్షణం ఈ ప్రపంచానికి రాజునయ్యాననే భావన కలిగింది.
👉 – Please join our whatsapp channel here –