DailyDose

వివో కంపెనీపై ఈడీ ఛార్జిషీటు దాఖలు

వివో కంపెనీపై ఈడీ ఛార్జిషీటు దాఖలు

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వివో అనుబంధ సంస్థ వివో ఇండియాపై (Vivo) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఛార్జిషీటును దాఖలు చేసింది. వివోతో పాటు ఇతరులపై వచ్చిన మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఈ సంస్థ దర్యాప్తు చేస్తోంది. దీనిలో భాగంగా తొలి ఛార్జిషీటును బుధవారం ప్రత్యేక కోర్టులో వేసింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద వివో ఇండియాపై అభియోగాలు మోపింది.

మనీలాండరింగ్‌ ఆరోపణలపై గతేడాది జులైలో వివో కార్యాలయాలు సహా సంబంధిత వ్యక్తుల నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా మనీలాండరింగ్‌ రాకెట్‌ను కనుగొంది. దేశంలో పన్ను ఎగవేత కోసం రూ.62,476 కోట్లను భారత్‌ నుంచి చైనాకు అక్రమంగా ఈ సంస్థ బదిలీ చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసులో లావా ఇంటర్నేషనల్‌ ఎండీ హరి ఓం రాయ్‌తోపాటు చైనాకు చెందిన గ్వాంగ్వెన్ అలియాస్ ఆండ్రూ కువాంగ్, ఛార్టర్డ్‌ అకౌంటెంట్లు నితిన్‌ గార్గ్‌, రజన్‌ మాలిక్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే కుట్రగా నాటి రిమాండ్‌ రిపోర్ట్‌లో ఈడీ పేర్కొంది.

వివో మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన లావా ఎండీ ఇటీవల కోర్టుకు తన వాంగ్మూలం ఇచ్చారు. పదేళ్ల క్రితం వివో ఇండియాతో కలిసి ఓ జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేయాలనుకున్నామని, అంతకుమించి తనకు చైనా కంపెనీతో గానీ, ఆ సంస్థ ప్రతినిధులతో గానీ 2014 నుంచి తనకు సంబంధం లేదని తెలిపారు. ఆ సంస్థ జరిపిన కుట్రపూరిత లావాదేవీలతో తన క్లయింట్‌కు సంబంధం లేదని లావా ఎండీ తరఫు లాయర్‌ కోర్టులో వాదించారు. వివో సంస్థపై దిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈడీ దర్యాప్తు చేపడుతోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z