Agriculture

గందరగోళంలో ఉచిత బీమా

గందరగోళంలో ఉచిత బీమా

16 మంది రైతులు… 0.04 హెక్టార్లు… ఏమిటీ అంకెలనుకుంటున్నారా?
రాష్ట్రం మొత్తంలో ప్రస్తుత ఖరీఫ్‌లో పంటలు సాగుచేస్తున్న రైతుల సంఖ్య 16.
రాష్ట్రమంతా కలిపి వారు సాగు చేస్తున్న విస్తీర్ణం 0.04 హెక్టార్లట. ఎవరన్నారీమాట… వైకాపా సర్కారు… ఎవరితో అందంటే… కేంద్ర ప్రభుత్వంతో…

కేంద్ర ప్రభుత్వ ఫసల్‌ బీమా యోజన పోర్టల్‌లో ఖరీఫ్‌ పంటల బీమాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తరఫున నమోదైన ఈ వివరాలు నివ్వెర పరుస్తున్నాయి. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో ఈ సీజన్‌ మొత్తంలో సాగైన పంటల విస్తీర్ణం 0.04 హెక్టార్లేనా? పంట పండిస్తున్న రైతులు 16 మందేనా.. అని ఆశ్చర్యం కలుగుతోందా…?

నమ్మాల్సిందే అంటోంది జగనన్న సర్కారు!!!
నిజానికి ఈ ఏడాది ఖరీఫ్‌లో 60 లక్షల మందికిపైగా రైతులు 37.75 లక్షల హెక్టార్లలో అంటే… 93.17 లక్షల ఎకరాల్లో పంటలు వేసినట్లు ఈ-క్రాప్‌లో నిక్షిప్తమై ఉంది. ఇందులో ఉచిత పంట బీమా ఎంత విస్తీర్ణానికి వర్తిస్తుందో, బీమా లేని విస్తీర్ణమెంతో ప్రశ్నార్థకమే. బీమా చేసిన విస్తీర్ణం లెక్కలను కేంద్ర ప్రభుత్వ బీమా పోర్టల్‌లో నమోదు కూడా చేయలేదు. దాంతో ప్రస్తుత మిగ్‌జాం తాకిడితో దెబ్బతిన్న తమ పంటలకు బీమా వర్తిస్తోందో లేదో అనే ఆందోళన రైతులను వెంటాడుతోంది.

తమదంతా పారదర్శక పాలనగా గొప్పలు చెప్పుకొనే వైకాపా ప్రభుత్వంలో ఎందుకో ఈ రహస్యం?

ఖరీఫ్‌ ముగిసి రెండు నెలలు గడచింది. అయినా రాష్ట్ర రైతులకు పంటల బీమా అమలవుతుందో, లేదో కూడా తెలియని దుస్థితి నెలకొంది. ప్రతి ఎకరా పంటకు ఉచితంగా బీమా కల్పిస్తున్నామని, వివరాలను రైతుభరోసా కేంద్రాల్లో సామాజిక తనిఖీలకు ఉంచామని ప్రభుత్వం ప్రకటనలు చేయడం తప్పితే… ఏ రైతు పంటకు ఎంత ఇన్సూరెన్స్‌(బీమా) చేశారనేది ఎవరికీ తెలియని పరిస్థితి. మిగ్‌జాంతో నిండా మునిగామని ఒకవైపు రైతులు కంటనీటితో అల్లాడుతుంటే… కేంద్ర పంటల బీమా పోర్టల్‌లో రాష్ట్ర వివరాలే లేవు. ఈ-క్రాప్‌, ఈకేవైసీ చేసిన ప్రతి రైతుకు నిబంధనల ప్రకారం ఉచిత పంటల బీమా అమలవుతుందని వ్యవసాయ శాఖ చెబుతున్నా.. దానిపై స్పష్టతే లేదు. తీరా బీమా పరిహారం చెల్లింపు సమయంలో… మీ పంటలకు బీమా లేదని, నిబంధనల ప్రకారం వర్తించదని చెబుతూ అన్నదాతకు మొండిచేయి చూపిస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లు వంద శాతం ఈ-క్రాప్‌ అనేది కూడా అంతా మాయే. ఈ-క్రాప్‌, పంటల బీమాలో తమ పేరు నమోదైందో, లేదో ఆన్‌లైన్‌లో తెలుసుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించడం లేదు. అంతా పారదర్శకంగా ఉంటే.. ఆన్‌లైన్‌లో ఉంచడానికి భయమెందుకు అనే ప్రశ్న రైతుల్లో వ్యక్తమవుతోంది. వివరాలన్నీ ఆన్‌లైన్‌లోనే నమోదు చేస్తున్నారు. అలాంటప్పుడు ప్రతి రైతు… ఉచిత పంటల బీమా తమకు వర్తిస్తుందో లేదో తెలుసుకునే వెసులుబాటును ఎందుకు కల్పించడం లేదనే ప్రశ్నకు సమాధానం ఇచ్చేవారే లేరు.

ఆ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ పేరే లేదు
కేంద్ర ప్రభుత్వ పంటల బీమా పోర్టల్‌లో 19 రాష్ట్రాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ గణాంకాలను పరిశీలిస్తే… పీఎంఎఫ్‌బీవై (ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన) కింద మూడు జిల్లాలు, 16 మంది రైతులు, 0.04 హెక్టార్ల విస్తీర్ణానికి మాత్రమే బీమా ఉన్నట్లు కన్పిస్తోంది. ఇక వాతావరణ ఆధారిత బీమాలో ఆంధ్రప్రదేశ్‌ పేరే లేదు. ఇది రైతుల్లో గందరగోళం సృష్టిస్తోంది. కేంద్ర పోర్టల్‌లో నమోదు చేసేందుకు అక్టోబరు ఆఖరు వరకు సమయం ఉందని వ్యవసాయ శాఖ గతంలో ప్రకటించింది. ప్రస్తుతం డిసెంబరు మొదటి వారం పూర్తవుతున్నా… పోర్టల్‌లో వివరాలేవీ కన్పించడం లేదు. దీనిపై వ్యవసాయ శాఖ కూడా నోరెత్తడం లేదు. అసలు బీమా ఉందో, లేదో… చేస్తే ఎన్ని లక్షల ఎకరాలకు బీమా వర్తింపజేస్తున్నారో కూడా చెప్పే పరిస్థితి లేదు. ప్రస్తుత వర్షాలతో కౌలు రైతులు కూడా పెద్దఎత్తున నష్టపోయారు. బీమా విషయం తెలియడం లేదనే ఆవేదన వారిలోనూ వ్యక్తమవుతోంది.

మొదట వద్దనుకుని… మళ్లీ కేంద్రం దగ్గరకే
కేంద్రం అమలు చేస్తున్న బీమా పథకాలతో రైతులకు మేలు జరగడం లేదని మొదట్లో వైకాపా ప్రభుత్వం ఆరోపించింది. అందుకే ఆయా పథకాల నుంచి బయటకు వచ్చి సొంతంగానే… ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నామని గొప్పగా చెప్పింది. కార్యాచరణ ప్రారంభించిన రెండేళ్లకు తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది. మళ్లీ కేంద్రం శరణు జొచ్చింది. అప్పుడెందుకు బయటకు వచ్చిందో, ఇప్పుడెందుకు మళ్లీ చేరిందో… ప్రభుత్వానికే తెలియాలి. తాము చెప్పిన సూచనలకు కేంద్రం అంగీకరించిందని చెబుతున్నా… ఈ-క్రాప్‌ నమోదు విషయానికే అది పరిమితమైంది. అదనంగా రైతులకు ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదు.

ఆదుకోవడం మరచి… ఎగ్గొట్టడమే లక్ష్యమా?
రాష్ట్రంలో సాగు చేసిన ప్రతి ఎకరాకు ఉచిత పంటల బీమా అమలు చేస్తామని వైకాపా ప్రభుత్వం హామీ ఇచ్చింది. తీరా ఆచరణకు వచ్చేసరికి నోటిఫైడ్‌ పంటలకేనంటూ సాకులు చెబుతూ చేతులెత్తేసింది. తమ చేతుల్లో పనే అయినా… తప్పించుకోవడానికి రకరకాల సాకులు చెబుతోంది. రాష్ట్రం సొంతంగా బీమా పథకాన్ని అమలు చేసిన సమయంలోనూ ఇలాగే నోటిఫైడ్‌ పంటల పేరిట అధిక శాతం రైతులకు బీమా పరిహారాన్ని ఎగ్గొట్టింది. మామిడి పంటకు వర్తింపజేయలేదు. మిరప రైతులకూ మొండిచేయి చూపింది. పత్తి, కంది తదితర పంటల రైతులకూ నామమాత్ర పరిహారంతోనే సరిపెట్టింది.

సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే నిబంధనలు అడ్డొస్తాయా?

కేంద్ర బీమా నిబంధనల ప్రకారం… ఒక జిల్లాలో ఏదైనా పంటకు బీమా అమలు చేయాలంటే ఆ పంటను నిర్దేశిత విస్తీర్ణంలో సాగు చేసి ఉండాలి. అయితే రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పాటు చేయడంతో అన్ని పంటల విస్తీర్ణం తగ్గిపోయింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ బీమా వర్తించడంలేదు. తమ నిబంధనలకు అనుగుణంగా సాగు విస్తీర్ణం ఉండటం లేదని కేంద్ర అధికారులు… బీమా అమలులో కోత పెడుతున్నారు. గతేడాది పసుపు రైతులు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు.

వాస్తవానికి నోటిఫైడ్‌ పంటల పేరిట వైకాపా ప్రభుత్వం… ఉచిత పంటల బీమా అమలుకు మూడేళ్లుగా కత్తెర వేస్తోంది. నిజంగా జగన్‌ సర్కారుకు చిత్తశుద్ధే ఉంటే కేంద్ర నిబంధనలు అడ్డొస్తాయా? సాగు చేసిన ప్రతి ఎకరాకు బీమా కల్పించాల్సిందే అంటే కేంద్రం వద్దంటుందా? బీమా సంస్థలు కుదరదంటాయా? తామిచ్చిన హామీ అమలు చేయాలనే ఆలోచనే ఉంటే… సొంతంగా అయినా బీమా పరిహారం చెల్లించవచ్చు. ఇక్కడ అదీ చేయడం లేదు.

బీమా ఉందో లేదో తెలియదు
– బండి రామకృష్ణ, కౌలు రైతు, లంకపాలెం, యలమంచిలి మండలం, పశ్చిమగోదావరి జిల్లా

పొలం కౌలుకు తీసుకుని ఒకటిన్నర ఎకరాల్లో వరి సాగు చేశాం. 4 రోజుల్లో కోత కోస్తామనగా తుపాను రావడంతో… పైరంతా పూర్తిగా పడిపోయి నీట మునిగింది. ఇప్పుడు 70% పనికిరాదు. మా పొలానికి పంటల బీమా చేశారో లేదో కూడా సమాచారం లేదు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z