Politics

రాజ్‌భవన్‌లో జరిగిన సాయుధ దళాల జెండా దినోత్సవ వేడుకల్లో గవర్నర్‌

రాజ్‌భవన్‌లో జరిగిన సాయుధ దళాల జెండా దినోత్సవ వేడుకల్లో గవర్నర్‌

సాయుధ దళాల జెండా దినోత్సవం(ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే) సందర్భంగా గురువారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘బయట నుంచే కాక అంతర్గత బెదిరింపులనూ ఛేదించే విధి నిర్వహణలో జీవితాలను త్యాగం చేసేందుకు సిద్ధపడే శౌర్యం, విధిపట్ల అంకితభావం ఉన్న సాయుధ దళాల సేవలను స్మరించుకునేందుకు, వారిని గౌరవించుకునేందుకు ఫ్లాగ్‌ డే ఒక ప్రత్యేక సందర్భం’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన చందా సమర్పించారు. గ్యాలెంట్రీ అవార్డు గ్రహీతలు ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ జె.రాజేంద్ర, బ్రిగేడియర్‌ సీఎస్‌ఎస్‌ ప్రకాష్‌, సిపాయి గొర్ల సురేంద్రలను గవర్నర్‌ సత్కరించారు. రాష్ట్రానికి చెందిన సైనికుల కుటుంబ సభ్యుల్లో పిట్టా శ్రీలక్ష్మి వీరనారిగా, వీర మాతలుగా సిరిగి సబ్బమ్మ, పి.మంగమ్మ, మిలటరీ ఆపరేషన్‌లో గాయపడిన సిపాయి కోటిరెడ్డి, అంగవైకల్యం బారిన పడిన లాన్స్‌ నాయక్‌ బిల్లకంటి మురళీధర్‌ గుప్తా, సార్జంట్‌ ఎన్‌వీఆర్‌ మోహన్‌రావు, పెట్టీ ఆఫీసర్‌ ఆండ్రూ థామ్సన్‌, సిపాయి పి.పట్టాభిరామిరెడ్డిలను సైతం గవర్నర్‌ సత్కరించారు. ఓఎన్జీసీ సమకూర్చిన మూడు చక్రాల వాహనాలను పలువురు మాజీ సైనికులకు అందజేశారు. ఫ్లాగ్‌ డే చందాలను ఎక్కువ మొత్తంలో సేకరించినందుకు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు, జిల్లా సైనిక సంక్షేమాధికారుల్లో కె.కళ్యాణవీణ, పి.సత్యప్రసాద్‌, కేవీఎస్‌ ప్రసాదరావు, పి.రమేష్‌లకు జ్ఞాపికలు బహూకరించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z