అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. గుర్తు తెలియని వ్యక్తి ఓ విశ్వవిద్యాలయంలో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన లాస్ వేగాస్ (Las Vegas)లో బుధవారం చోటు చేసుకొంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. నెవాడా విశ్వవిద్యాలయం (Nevada university)లో మధ్యాహ్నం ఓ ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల నుంచి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు విద్యార్థులు పరుగులు తీసి సమీప గదుల్లో దాక్కొన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అయితే, చనిపోయిన వారిలో అనుమానితుడు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. కేవలం యూనివర్సిటీలో మాత్రమే కాకుండా నగరంలో మరో చోట కూడా కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో విశ్వవిద్యాలయంతో పాటు సమీపంలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా తాత్కాలికంగా మూసి వేశారు.
ఇదిలా ఉండగా.. గత కొన్నేళ్లుగా అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల మైనేలోని లెవిస్టన్ ప్రాంతంలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఏకంగా 22 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. జూదానికి పేరొందిన లాగ్ వేగాస్కు భారీగా సందర్శకులు వస్తుంటారు. తాజాగా నగరంలో చోటుచేసుకొన్న ఈ కాల్పుల ఘటనతో వారు భయభ్రాంతులకు గురయ్యారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z