అక్రమంగా రవాణా చేస్తున్న రూ.3.61కోట్ల విలువైన 72.30లక్షల విదేశీ సిగరెట్లను కేంద్ర జీఎస్టీ(సీజీఎస్టీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు గుంటూరు సీజీఎస్టీ కమిషనరేట్ అధికారులు ఈ నెల 5, 6 తేదీల్లో కోల్‌కత్తా–చెన్నై జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. నెల్లూరు సమీపంలో 33.30 లక్షల విదేశీ సిగరెట్లను తరలిస్తున్న ఓ వాహనాన్ని, బాపట్ల జిల్లా సంతమాగులూరు సమీపంలో 39 లక్షల విదేశీ సిగరెట్లను తరలిస్తున్న మరో వాహనాన్ని గుర్తించారు.
ఆ విదేశీ సిగరెట్ల ప్యాకెట్లపై తయారీ కంపెనీ వివరాలు, ఎక్సై్పరీ తేదీ, ఇతర వివరాలు ఏవీ లేవు. వాటిని తరలిస్తున్న వాహనాల డ్రైవర్లు ఆ విదేశీ సిగరెట్లను దిగుమతి చేసుకున్నట్టు తగిన పత్రాలు గానీ పన్ను చెల్లించిన రశీదులను గానీ చూపించలేకపోయారు. దాంతో మొత్తం రూ.3.61కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు జప్తు చేసి కేసు నమోదు చేశారు. గుంటూరు సీజీఎస్టీ కమిషనరేట్ అధికారులు మూడు నెలల్లో అక్రమంగా రవాణా చేస్తున్న రూ.4.88కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.
👉 – Please join our whatsapp channel here –