Agriculture

ఈ బాధను తట్టుకోలేక వరిపంటను తొక్కేస్తున్న!

ఈ బాధను తట్టుకోలేక వరిపంటను తొక్కేస్తున్న!

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కాప్తానిపాలేనికి చెందిన కౌలు రైతు యార్లగడ్డ వీరప్రసాద్‌.. రూ.1.35 లక్షల పెట్టుబడితో ఆరెకరాల్లో వరి నాట్లు వేశారు. పంట బాగా వస్తోందని అనుకునేలోపే తుపాను విరుచుకుపడింది. కోతకొచ్చిన వరి మొత్తం నేలవాలి మొలక వచ్చింది. ‘కోత కోయిద్దాం అంటే ఎకరాకు రూ.11 వేలు అడుగుతున్నారు. ఆరెకరాలకు రూ.66 వేలు కావాలి. నూర్పిడి చేసినా ఆశించిన దిగుబడి రాదు. రంగు మారిన గింజకు సరైన ధర ఇవ్వరు. ఈ బాధపడలేక వరి చేను తొక్కించేస్తున్నా’ అని వీరప్రసాద్‌ వాపోయారు. ఈ పరిస్థితి వీరప్రసాద్‌ ఒక్కరిదే కాదు. రాష్ట్రంలో లక్షల మంది రైతుల వేదన ఇది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని జిల్లాల్లోనూ కోత దశలో ఉన్న వరి.. తుపాను ధాటికి నేల వాలింది. అధికశాతం పొలాల్లోంచి నీరు బయటకు పోయే పరిస్థితి లేకపోవడంతో అక్కడే మొలకలొస్తున్నాయి. ఇప్పటికిప్పుడు కోత కోయించాలంటే రెట్టింపు ఖర్చు అవుతుంది.సాధారణంగా ధాన్యం క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,183 కాగా తేమ శాతం అధికంగా ఉన్న, రంగుమారిన ధాన్యానికి అందులో సగం కూడా దక్కదు. వారం ముందు వరకు ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి ఆశించిన రైతులకు.. ఇప్పుడు 15 క్వింటాళ్లు రావడమూ కష్టమే. ఈ ధాన్యాన్ని అమ్మినా కోత ఖర్చులకు గిట్టుబాటు కాదు. పెట్టుబడిలో చిల్లిగవ్వ కూడా చేతికి రాదు. కూలీలను తెచ్చి, అమ్మడానికి అగచాట్లు పడి.. ఆ సొమ్ము వచ్చే వరకు ఎదురు చూడటం కంటే దమ్ము తొక్కించి మరో పంట వేసుకోవడమే నయమని రైతులు ఆలోచన చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z