Videos

తొలి బుల్లెట్ రైలు స్టేషన్

తొలి బుల్లెట్ రైలు స్టేషన్

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక సమచారాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ పంచుకొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అహ్మదాబాద్‌లోని సబర్మతి మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కారిడార్‌ హబ్‌లో తొలి బుల్లెట్‌ రైలు కోసం నిర్మించిన స్టేషన్‌ వీడియోను ఆయన షేర్‌ చేశారు. ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య దేశంలోనే తొలిసారి హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే.

అహ్మదాబాద్‌ స్టేషన్‌ను జంట భవనాలుగా రూపొందించారు. వీటి గోడలపై ఉప్పు సత్యాగ్రహం సన్నివేశాలకు సంబంధించిన భారీ చిత్రాలను ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్‌ మొత్తం విస్తీర్ణం 1,33,000 చదరపు మీటర్లు. దీనిలో ఆఫీస్‌లు, వాణిజ్య కార్యాలయాలు, రిటైల్‌ స్టోర్లు ఏర్పాటు చేసుకొనే విధంగా నిర్మించారు. ఈ మొత్తం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.

మరోవైపు ముంబయిలో బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌ స్టేషన్‌ సివిల్‌ వర్క్స్‌ దాదాపు 15శాతం పూర్తయ్యాయని గత నెల నేషనల్‌ హైస్పీడ్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. మొత్తం బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులో బీకేసీ పనులు ఇప్పటికే 15 శాతం పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టులోని ఏకైక అండర్‌గ్రౌండ్‌ స్టేషన్‌ ఇదే. 16 కోచ్‌ల బుల్లెట్‌ రైలు కోసం నిర్మించిన ఈ స్టేషన్‌లో ఆరు ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి.

రెండు ఆర్థిక కేంద్రాలను అనుసంధానిస్తూ 508 కిలోమీటర్ల మేరకు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. వీటిల్లో 448 కిలోమీటర్ల ప్రయాణం ఎత్తైన కారిడార్‌పై జరుగుతుంది. మరో 26 కిలోమీటర్లు సొరంగ మార్గాల్లో, 10 కిలోమీటర్లు వంతెనలపై, 7 కిలోమీటర్లు ఘాట్‌ మార్గాల్లో ఉంటుంది.