DailyDose

పొరుగు రాష్ట్రాలతో స్నేహభావాన్ని ఆకాంక్షిస్తున్నాం!-తాజా వార్తలు

పొరుగు రాష్ట్రాలతో స్నేహభావాన్ని ఆకాంక్షిస్తున్నాం!-తాజా వార్తలు

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ.. ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు (ChandraBabu) అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి చంద్రబాబు లేఖ రాశారు. ‘‘ఎలక్టోరల్‌ మాన్యువల్‌ 2023 ప్రకారం మార్పులు జరగట్లేదు. క్షుణ్నంగా పరిశీలించి డబుల్‌ ఎంట్రీలను తొలగించాలి. ఇప్పటికీ డబుల్‌ ఎంట్రీలు గుర్తిస్తూనే ఉన్నారు. ఓటరు జాబితాలో ఇంకా మరణించిన వారి ఓట్లున్నాయి. ఆన్‌లైన్‌లో ఇష్టానుసారంగా ఓట్లు నమోదు చేస్తున్నారు.. ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారు. మా అభ్యంతరాలపై ఇప్పటికీ దృష్టిపెట్టలేదు. ఓట్లను తొలగించాలంటే కచ్చితమైన ఆధారాలు చూపించాలి. ఎలాంటి విచారణ లేకుండానే ఓట్లను తొలగిస్తున్నారు. ఓట్ల అవకతవకలు పునరావృతం కాకుండా ఈసీ చూడాలి’’ అని ఈసీకి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

* పొరుగు రాష్ట్రాలతో స్నేహభావాన్ని ఆకాంక్షిస్తున్నాం!

సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ ఇరుగుపొరుగు రాష్ట్రాలన్నింటితో స్నేహభావాన్ని, అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని కాంక్షిస్తున్నట్లు తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం పదవి చేపట్టిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలపై రేవంత్‌ రెడ్డి ప్రతిస్పందించారు.ట్విట్టర్‌ వేదికగా స్పందించిన రేవంత్‌..‘శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో పాటు, పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం.. అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది’ అంటూ వ్యాఖ్యానించారు. అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రేవంత్‌కు శుభాకాంక్షలు చెబతూ..‘తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ ‌రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే.

ప్రజాదర్బార్‌ పై సీఎం రేవంత్‌ ఆసక్తికర ట్వీట్‌ 

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నేడు ‘ప్రజాదర్బార్‌’ నిర్వహించిన విషయం తెలిసిందే. జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌ వద్దకు వచ్చిన ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజాదర్బార్‌ జరిగిన తీరుపై సీఎం రేవంత్‌ ఆసక్తికర ట్వీట్‌ చేశారు.‘‘జనం కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ తొలి ప్రజా దర్బార్ సాగింది. జనం నుంచి ఎదిగి.. ఆ జనం గుండె చప్పుడు విని.. వాళ్ల సేవకుడిగా సాయం చేసే అవకాశం రావడానికి మించిన తృప్తి ఏముంటుంది!’’ అని ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న వీడియోను ఆయన పోస్ట్‌ చేశారు.

ప్రగతి భవన్ పేరు మార్పు

 ప్రగతిభవన్ పేరును మారుస్తూ కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకాలం ప్రగతి భవన్‌గా కొనసాగిన సీఎం క్యాంపు కార్యాలయాన్ని ఇక నుంచి ‘మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్’గా మారుస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. పేరు మార్పు వెంటనే అమల్లోకి రానున్నట్లు ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు. గురువారం సీఎంగా ఓవైపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తుండగానే మరో వైపు ప్రగతిభవన్ వద్ద ఇనుప కంచెలను పోలీసు అధికారుల సమక్షంలో తొలిగించిన విషయం తెలిసిందే.

ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ

 తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శాసనసభ ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని సీఎం రేవంత్ రెడ్డి నియమించారు. ప్రభుత్వ అభ్యర్థనను అంగీకరించిన అక్బరుద్దీన్ ఓవైసీ.. రేపు ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సభలో సీనియర్లుగా ఉన్న ఎమ్మెల్యేలలో ఒకరిని ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ఎన్నికైన సభ్యుల్లో మాజీ సీఎం కేసీఆర్ సభలో అందరి కంటే సీనియర్. కానీ, ఆయన ఆసుపత్రిలో చేరడంతో రేపటి అసెంబ్లీ సమావేశానికి దూరంగానే ఉండనున్నారు.ఆ తరువాత మాజీ స్పీకర్ పోచారం, మాజీ మంత్రి హరీష్ రావు, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో పాటు మరికొందరు సీనియర్లుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అక్బరుద్దీన్ ఓవైసీకీ ప్రభుత్వం ప్రొటెమ్ స్పీకర్‌గా అవకాశం కల్పించింది. దీంతో ఓవైసీ తొలుత రాజ్ భవన్‌లో గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సభలో కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను ఎన్నుకుంటారు. కాగా గత ఎన్నికల్లో ఎంఐఎం, బీఆర్ఎస్‌కు మిత్రపక్షంగా కలిసి నడిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం అక్బరుద్దీన్‌కు అవకాశం కల్పించడం ఆసక్తిగా మారింది. కాగా 2018లోనూ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎంకే అవకాశం దక్కింది. అప్పుడు చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను ప్రొటెమ్ స్పీకర్‌గా కేసీఆర్ నియమించారు.

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి మలయాళ నటి లక్ష్మీకా సజీవన్ కన్నుమూశారు. ప్రస్తుతం యూఏఈలో ఉన్న ఆమె గుండెపోటుతో కేవలం 27 ఏళ్లకే తుదిశ్వాస విడిచారు. ఈ వార్త మాలీవుడ్ ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.  అజు అజీష్ దర్శకత్వం వహించిన ‘కాక్క’ షార్ట్ ఫిల్మ్‌లో పంచమిగా నటించిన లక్ష‍్మిక ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. లక్ష్మిక సజీవన్ తన కెరీర్‌లో పంచవర్ణతతా, సౌదీ వెల్లక్కా, పూజయమ్మ, ఉయారే, ఒరు కుట్టనాదన్ బ్లాగ్, నిత్యహరిత నాయగన్, దుల్కర్ సల్మాన్ నటించిన ఒరు యమందన్ ప్రేమకథా చిత్రాల్లో నటించింది

కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపిన మోదీ

 తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని మోదీ ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆరా తీశారు. ఈ సందర్బంగా కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆరోగ్యశాఖ కార్యదర్శిని యశోద ఆసుపత్రికి పంపించారు సీఎం రేవంత్‌. కాగా, ప్రధాని మోదీ ట్విట్టర్‌ వేదికగా..‘తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గాయం అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ కామెంట్స్‌ చేశారు.

మూడు రాష్ట్రాలకు కొత్త సీఎంల ఎంపికపై కసరత్తు

దేశంలో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో కాంగ్రెస్, మిజోరంలో జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. అయితే ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక మాత్రం ఇంకా జరగలేదు. ఈ క్రమంలోనే ఇవాళ బీజేపీ సీఎంల ఎంపికపై స్పీడ్ పెంచింది. ఈ సందర్భంగా బీజేపీ ఇవాళ సీఎంల ఎంపిక కోసం పరిశీలకులను నియమించింది.రాజస్థాన్‌కు రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్, వినోద్ తావడే, సరోజ్​పాండేను నియమించింది. మధ్యప్రదేశ్‌కు హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, కే.లక్ష్మణ్, ఆశా లక్రాను ప్రకటించింది. ‌ఛత్తీస్‌గఢ్‌కు కేంద్ర మంత్రులు అర్జున్​ముండా, సర్బానంద సోనోవాల్, దుష్యంత్​గౌతమ్‌ను పరిశీలకులుగా నియమించింది. అయితే ఆయా రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పరిశీలకులు సమావేశమై సీఎం అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. కాగా, సీఎం అభ్యర్థులుగా ఈ రాష్ట్రాల్లో సీఎం పదవి కోసం చాలా సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z