సీఎం జగన్ ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ, పాలన గాలికొదిలేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ప్రజాధనం దోచి దాచుకునే బిజీలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రాజెక్టులు కొత్తవి కట్టకపోగా, ఉన్న వాటి నిర్వహణనీ పట్టించుకోలేదని విమర్శించారు. ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకు కూడా నిధులు ఇవ్వలేని దిక్కుమాలిన పాలనలో.. గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు విరిగిపోయిందని లోకేశ్ ఆరోపించారు. గతేడాది గుండ్లకమ్మ ప్రాజెక్టు మూడో గేటు కొట్టుకుపోయిందన్న లోకేశ్.. నీరు వృథాగా పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
ప్రాజెక్టుల నిర్వహణను జగన్ గాలికొదిలేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. జగన్ సోమరితనంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు ఊడి నీరు వృథాగా పోతోందని విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా తమపై నిందలా అంటూ మండిపడ్డారు. టీఎంసీ – క్యూసెక్కుకు తేడా తెలియని వారికి నీటిపారుదల శాఖ కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ తీరు మారకపోతే ప్రాజెక్టుల దగ్గర ఆందోళనలు చేపడతామని అచ్చెన్న హెచ్చరించారు. మరోవైపు, గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద విరిగిన రెండో గేటును తెదేపా ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, స్వామి, తెదేపా ఇన్‌ఛార్జి విజయకుమార్ తదితరులు పరిశీలించారు.
👉 – Please join our whatsapp channel here –