పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ వచ్చే పదేళ్లలో రూ. 7 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా ఇన్‌ఫ్రా రంగంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. గ్రూప్ సంస్థ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ .. స్టాక్ ఎక్స్చేంజీలకు ఈ మేరకు సమాచారమిచ్చింది. మైనింగ్, విమానాశ్రయాలు, డిఫెన్స్.. ఏరోస్పేస్, సౌర విద్యుదుత్పత్తి, రహదారులు, డేటా సెంటర్లు మొదలైన వ్యాపార విభాగాల్లో అదానీ గ్రూప్ విస్తరించింది.
పోర్టుల వ్యాపారంలో పర్యావరణ హిత విధానాలను ప్రవేశపెడుతోంది. అన్ని క్రేన్లను విద్యుదీకరించడం, అంతర్గతంగా డీజిల్ వాహనాలకు బదులు బ్యాటరీ ఆధారిత వాహనాలకు మళ్లడం, అదనంగా 1000 మెగావాట్ల క్యాప్టివ్ పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం వంటివి వీటిలో ఉన్నాయి. అటు అదానీ ఎలక్ట్రిసిటీ 2027 నాటికి ముంబైలో 60 శాతం మేర పునరుత్పాక విద్యుత్‌ను సరఫరా చేసే దిశగా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఇది 38 శాతంగా ఉంది. ఇక గ్రూప్‌లో భాగమైన అంబుజా, ఏసీసీ కంపెనీలు దేశీయంగా సిమెంట్ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థలుగా ఉన్నాయి.
తమ సిమెంటు ఉత్పత్తిలో 90 శాతం భాగం రీసైకిల్ చేసిన ఫ్లై యాష్ వ్యర్ధాలు, స్లాగ్ ఉంటాయని అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. 2028 నాటికి సిమెంటు ఉత్పత్తి కోసం వినియోగించే పునరుత్పాదక శక్తి వాటాను 60 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 2030 నాటికి 10 కోట్ల మొక్కలను నాటాలన్న లక్ష్యం దిశగా పని చేస్తున్నామని ఆయన చెప్పారు. అదానీ గ్రూప్ ఇటీవలే సిమెంటు, టెలికం, మీడియా వ్యాపార విభాగాల్లోకి కూడా ప్రవేశించింది.
👉 – Please join our whatsapp channel here –