తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్తరాంధ్ర ముఖద్వారం పాయకరావుపేటకు సోమవారం సాయంత్రం చేరనుంది. యువనేతకు స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణం పూర్తిగా పసుపు వర్ణ శోభితంగా మారింది. సోమ, మంగళ, బుధవారాల్లో నియోజకవర్గంలో యాత్ర కొనసాగనుంది. వీటి ఏర్పాట్లను తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభ వేదికను తెదేపా నేతలు ఖరారు చేశారు. రెండు మూడు ప్రదేశాలను పరిశీలించినప్పటికీ అధిష్ఠానం ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం, భోగాపురం మండలం పోలిపల్లి గ్రామ శివారులోని భూమాత లేఅవుట్‌లో ఈనెల 20న సభను నిర్వహించాలని నిర్ణయించారు. సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు 5లక్షల మంది వరకు హాజరవుతారని తెదేపా నేతలు భావిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం విశాఖలోని ఓ హోటల్‌లో ఉత్తరాంధ్ర జిల్లాల తెదేపా ఇన్‌ఛార్జి దామచర్ల సత్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, నియోజకవర్గాల బాధ్యులు కోరాడ రాజబాబు, గండిబాబ్జీ, తదితరులు హాజరయ్యారు. ‘బహిరంగ సభకు వేదిక ఏర్పాటు, ఇతర పనుల కోసం ఈనెల 11న భూమి పూజ చేయనున్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నియోజకవర్గాల బాధ్యులు పాల్గొంటారు. బహిరంగ సభ కోసం ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈనెల 19వ తేదీ నాటికి విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ పరిధి అగనంపూడి వద్దకు లోకేశ్ పాదయాత్ర చేరుకోనున్నది. పాదయాత్ర ముగింపునకు సూచికగా 20న అక్కడ చిహ్నం ఆవిష్కరించనున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో లోకేశ్ బహిరంగ సభా స్థలికి చేరుకుంటారు’ అని పార్టీ నేతలు తెలిపారు. తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ హాజరవుతారని పేర్కొన్నారు.
తొలిరోజు యాత్ర ఇలా…
సాయంత్రం 5.30 గంటలకు పాయకరావుపేటలో అడుగుపెడతారు.
5.50కి జుడియో వద్ద 14వ వార్డు వాసులతో మాటమంతీ
6.20కి సబ్‌స్టేషన్ సమీపంలో ఒకటో వార్డు వద్ద పట్టణ వాసులతో..
6.30 జాతీయ రహదారి వై కూడలి వద్ద స్థానికులతో సమావేశం
7.00కి పి.ఎల్.పురం కూడలి వద్ద యువతను కలుస్తారు.
7.30కి సీతారాంపురం కూడలి వద్ద గ్రామస్థులతో మాట్లాడుతారు
8.00కి నామవరంలోని వైభవ్ లేఅవుట్‌లో రాత్రి విడిదిలో బస చేస్తారు. తొలిరోజు అయిదు కిలోమీటర్ల పాదయాత్ర సాగనుంది.
👉 – Please join our whatsapp channel here –