* ఏం కష్టం వచ్చిందో?
ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ.. నెల రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న ఓ యువ జంట అందరూ చూస్తుండగానే సముద్రంలోకి వెళ్లిపోయింది.. ఆ బీచ్‌లో ఉన్నవాళ్లు అంతా చూస్తుండగా.. సముద్రంలోకి వెళ్లారు.. వెనక్కి రావాలంటూ అక్కడున్నవాళ్లు ఎంత అరచినా పట్టించుకోకుండా వెళ్లిపోయి.. గల్లంతయ్యారు.. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లా జువ్వలపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు నవ దంపతులు లేలంగి లక్ష్మీనారాయణ, గాయత్రి నెల రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు.. అయితే, కార్తికమాసం సందర్భంగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుంటామని ఇంటి దగ్గర చెప్పి బయటకు వచ్చారు ఆ నవ దంపతులు.. ఇద్దరు చేతులకు చున్నీ కట్టుకుని అంతర్వేది బీచ్ సమీపంలో 500 మీటర్ల దూరంలో అందరూ చూస్తుండగానే సముద్రంలోకి వెళ్లిపోయారు.. వారు సముద్రంలోనకి వెళ్తున్న దృశ్యాలను చూసిన బీచ్‌లో ఉన్నవారు.. వారిని వారించే ప్రయత్నం చేశారు.. వెనక్కి రావాలంటూ కేకలు వేశారు.. అయినా ఆ ఇద్దరు అలా సముద్రంలోకి వెళ్లి అదృశ్యమయ్యారు.. దీంతో, సమీపంలో ఉన్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.. ఇప్పటి వరకు ఆ యువ జంట జాడ చిక్కలేదు.. సముద్రం ఒడ్డున వదిలిన ఫోన్ ఆధారంగా పేరెంట్స్ కు సమాచారం ఇచ్చిన సఖినేటిపల్లి పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* నారాయణ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలు కేసులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. అసైన్డ్ భూముల కొనుగోలు కేసులో మాజీమంత్రి నారాయణతోపాటు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బంధువులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. అసైన్డ్ భూముల కొనుగోలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ఏపీ సీఐడీ మాజీ మంత్రి నారాయణ, మరికొందరిపై గతంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో సీఐడీ అభ్యర్థన మేరకు తదుపరి విచారణను వచ్చే వారానికి న్యాయస్థానం వాయిదా వేసింది.మరోవైపు ప్రజా ప్రతినిధులపై పెండింగ్ కేసుల అంశంపై నమోదు చేసిన సుమోటో పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. మొత్తం ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయనే వివరాలు ఇవ్వాలని విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ప్రజాప్రతినిధులపై పెండింగ్ కేసుల్లో జాప్యాన్ని తగ్గించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి హైకోర్టు మానిటరింగ్ చేయాలని సుప్రీంకోర్టు గతంలో హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.
* చెరువులోకి దూసుకెళ్లిన కారు
కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపుర బైపాస్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రేవా కళాశాలకు చెందిన విద్యార్థులు ఠాగూర్ (21), పవన్ (22), ఆర్యన్ (22), వసంత్ (21) మృతి చెందారు. బెంగళూరు నుంచి చిక్కబళ్లాపురకు కారులో వస్తున్న సమయంలో బైపాస్ రోడ్డులో ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద వాహనం అదుపు తప్పి చెరువులోకి దూసుకువెళ్లింది. నీటిలో కారు మునిగిపోవడంతో అందులో ఉన్న వారు బయటకు రాలేకపోయారు. వెనుకే వస్తున్న అంబులెన్సు డ్రైవరు పోలీసులకు సమాచారం అందజేశారు. అగ్నిమాపకదళ సిబ్బందితో కలిసి కారును వెలుపలికి తీసేలోగా నలుగురూ మరణించారు.
* ఓ మహిళకు పార్ట్ టైం జాబ్ ఆఫర్ చేసి 3.37 లక్షలు కొట్టేసిన స్కామర్లు
ఓ మహిళకు పార్ట్‌టైం జాబ్ ఆఫర్ చేసిన స్కామర్లు ఆమె దగ్గర నుంచి ఏకంగా 3.37 లక్షల రూపాయలను కొట్టేశారు. ఈ సంఘటన లక్నోలో వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన కుష్భు పాల్ అనే మహిళను స్కామర్లు పార్ట్ టైం జాబ్ పేరుతో మోసం చేశారు. నివాస్ పస్కర్ అనే వ్యక్తి ఆన్ లైన్ లో మహిళను పరిచయం చేసుకుని వీడియోలు, పోస్ట్ లకు లైక్ చేయడం వల్ల పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు అని బాధితురాలిని నమ్మించి మోసం చేశాడు.ఇక, నిందితుడు కుష్బు పాల్ ను ఓ వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ చేశాడు. ఆపై నకిలీ ట్రేడింగ్ వెబ్సైట్లో సైనింగ్ కావాలని బాధితురాలిని నమ్మించి.. బ్యాంక్ అకౌంట్‌ను కూడా లింక్ చేయాలని కుష్భు పాల్‌పై నివాస్ వస్కర్ ఒత్తిడి చేశాడు. దీంతో ఆమె ఖాతా నుంచి పెద్ద మొత్తంలో డబ్బును స్కామర్లు కొట్టేశారు. మోసపోయానని గుర్తించిన కుష్బూ పాల్ ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసింది. ఇక, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అమీనాబాద్ ఎస్హెచ్ఓ సునీల్ కుమార్ ఆజాద్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశాం.. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారని ఎస్హెచ్ఓ సునీల్ కుమార్ ఆజాద్ వెల్లడించారు.
* దేవుని ముసుగులో గంజాయి రవాణా
దేవుని ముసుగులో అక్రమంగా గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డ సంఘటన భద్రాచలం పట్టణంలో చోటుచేసుకుంది. సరిహద్దు రాష్ట్రం చత్తీస్గడ్ రాష్ట్రం నుండి కొనుగోలు చేసిన సుమారు 400 కేజీల గంజాయిని దేవుని రథంలా ఏర్పాటు చేసిన ఆటోలో భద్రాచలం మీదుగా తరలిస్తుండగా ఖచ్చితమైన సమాచారంతో టాస్క్ ఫోర్స్, భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు. గంజాయి, వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఇరువురిపై కేసు నమోదు చేశారు.
* హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.. మైలార్ దేవ్ పల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక టాటానగర్ లోని ఓ ప్లాస్టిక్ గోడైన్లో రాత్రివేళ ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.. ఆ మంటలను చూసి జనం భయబ్రాంతులకు గురయ్యారు..ప్లాస్టిక్ వస్తువులు కావడంతో మంటలు త్వరగా వ్యాపించాయి.. చుట్టు కొద్ది కిలోమీటర్ల మేరకు దట్టమైన పొగలు వ్యాపించడంతో చుట్టు పక్కల ఉన్న జనాలకు ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వేగంగా వచ్చారు. అప్పటికే మంటలు భారీగా వచ్చేశాయి. వాటిని కంట్రోల్ లోకి తేవడానికి 4 గంటలు పట్టింది. మంటల్లో ప్రాణ నష్టం ఏదీ లేదని తెలుస్తోంది. ఆస్తి నష్టం మాత్రం భారీగా ఉండొచ్చని అంటున్నారు అధికారులు..మంటలు అదుపులోకి రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.. ఈ ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందగానే హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.. అసలు ఈ మంటలు ఎందుకొచ్చాయి? షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చాయా? ఎవరైనా కావాలని కుట్ర చేశారా? అనే అనుమానాలు ఉన్నాయి. అధికారులు పరిశీలిస్తున్నారు… ఈ ప్రమాద సమయంలో గోడౌన్ లో ఎవ్వరు లేరని తెలుస్తుంది.. దాంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.. ఈ అగ్ని ప్రమాదం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
* శ్రీశైలం హైవే పై యాక్సిడెంట్
శ్రీశైలం -హైదరాబాద్ నెహ్రూ మార్గ్ 765 జాతీయ రహదారిపై వంగూరు మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గేటు వద్ద బైక్ పై వెళ్తున్న కల్వకుర్తి మండలంలోని మార్చల గ్రామానికి చెందిన కిషోర్, శ్రీకాంత్ ఇద్దరు బైక్ పై రోడ్డు దాటే క్రమంలో ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరొక వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని వెంటనే అంబులెన్స్ సహాయంతో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఈఎంటి వెంకటయ్య, పైలెట్ పాండురంగయ్య తెలిపారు. అదే విధంగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కిషోర్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్ నుంచి హైదరాబాద్ కు రెఫర్ చేసినట్లు వారు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –