తాను రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నటించిన చిత్రాల్లో ‘కాదల్ ది కోర్’ (Kaathal The Core) ఉత్తమమైనదని నటి జ్యోతిక (jyothika) అన్నారు. పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ చిత్రాల్లో తనకు నటించాలని ఉందని.. ఈ చిత్రంలో తనది అలాంటి పాత్రేనని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమా తన ఇంటిల్లిపాదికి నచ్చిందన్నారామె. అంతేకాకుండా గతంలో తనకు ఎన్నో చిత్రాల్లో అవకాశాలు వచ్చాయని కాకపోతే ఒకే ఒక్క కారణంతో తాను వాటన్నింటినీ వదులుకున్నానని చెప్పారు.‘‘నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 25 ఏళ్లు అవుతోంది. నటిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. అగ్ర దర్శకులు సైతం నాకు ఆఫర్స్ ఇచ్చారు. అవి ఏవీ కూడా నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లా నాకు అనిపించలేదు. కేవలం, ఒక నటుడికి జంటగా కనిపించడానికి మాత్రమే ఆ రోల్స్ క్రియేట్ చేశారు. దాంతో నేను.. ‘‘నాపై ఉన్న అభిమానంతో అవకాశం ఇస్తున్నందుకు ధన్యవాదాలు. కాకపోతే, ఈ పాత్ర ఓకే చేయడానికి ఏమైనా రెండు మంచి సీన్స్ ఉంటే చెప్పండి’’ అని అడిగిన సందర్భాలున్నాయి. అలాంటి అవకాశాలు వచ్చినందుకు అమర్యాదకరంగా అనిపించింది. ఎందుకంటే నటనకు ఆస్కారం లేని పాత్రలు పోషించడం నాకు నచ్చదు. అలాంటి సమయంలోనే మలయాళం పరిశ్రమ నుంచి ‘కాదల్ ది కోర్’లో అవకాశం వచ్చింది. ఇందులో నాది కూడా హీరోకు సమానంగా ఉండే పాత్ర’’ అని జ్యోతిక చెప్పారు. అలాగే, బాలీవుడ్ అగ్ర దర్శకులు కొంతమంది హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారని.. కోలీవుడ్ అగ్ర దర్శకులు మాత్రం అలాంటి సినిమాలపై మక్కువ కనబర్చడం లేదన్నారు.
👉 – Please join our whatsapp channel here –