ప్రపంచంలో కుటుంబ నియంత్రణా కార్యక్రమాన్ని అధికారికంగా అమలు చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది. అవకాశం బట్టి పిల్లలు అనికాక అవసరం బట్టి పిల్లలు అనే సందేశాన్నిచ్చారు. మొదటి ప్రణాళికలో కుటుంబ నియంత్రణకు రూ.65లక్షలు కేటాయించారు. 1950వ దశకంలో కుటుంబ నియంత్రణా కార్యక్రమాన్ని దేశంలో కొన్ని ప్రధాన ప్రాంతాలకు పరిమితం చేశారు.
అందుకే దీన్ని క్లీనికల్ అప్రోచ్ అంటారు. 1960వ దశకంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించి ఎక్స్టెన్షన్ అప్రోచ్ గా అమలుపరిచారు. ప్రజలు తమకు నచ్చిన కుటుంబ నియంత్రణా విధానాన్ని ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తూ వాణిజ్య వస్తువులు విక్రయించే దుకాణాల ద్వారా గర్భనిరోధక సాధనాలను పంపిణీ చేశారు. దీనినే కేఫ్ టేరియా అప్రోచ్ అంటారు.
1966లో పూర్తిస్థాయి కుటుంబ నియంత్రణాశాఖను ఏర్పాటు చేశారు. 1971లో గర్భస్రావాలను చట్టబద్ధత కల్పించారు. ఆ తర్వాత ప్రధాని ఇందిరాగాంధీ సాహసోపేతమైన విధానం ప్రకటించారు. ఇదే మొదటి జాతీయ జనాభా విధానం – 1976. దీనిలో బాలికల వివాహ వయస్సును 15 నుంచి 18 సంవత్సరాలకు, బాలుర వివాహ వయస్సును 18 నంచి 21 సంవత్సరాలకు పెంచారు. నియోజకవర్గాల పరిధిని 1971 సెన్సెస్ ప్రాతిపదికనే 2001 వరకు కొనసాగుతుందని 42వ రాజ్యాంగ సవరణ చేశారు.
జనాతా ప్రభుత్వ కాలంలో కుటుంబ నియంత్రణ శాఖను కుటుంబ సంక్షేమశాఖగా పేరు మార్చారు. ఎనిమిదో ప్రణాళికలో తొలిసారిగా జనాభా పెరుగుదల రేటును తగ్గించడం ఒక ప్రధాన లక్ష్యంగా నిర్దేశించారు. దీనిలో భాగంగా వికేంద్రీకృత కుటుంబ నియంత్రణా కార్యక్రమం అమలుచేశారు. ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసులపై రెండో జాతీయ జనాభా విధానం–2000ను ప్రకటించారు. దీనిలో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించారు.
👉 – Please join our whatsapp channel here –