జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను (Nadendla Manohar) పోలీసులు అరెస్టు చేశారు. విశాఖలోని టైకూన్ కూడలి నుంచి వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడంపై జనసేన ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ఈరోజు ఆందోళనకు దిగారు. దీనికి మద్దతుగా నోవాటెల్ హోటల్ వద్ద నాదెండ్ల ఆందోళనకు దిగారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
అంతకుముందు నోవాటెల్ హోటల్ వద్ద నాదెండ్ల మీడియాతో మాట్లాడారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలు మానుకోవాలని వైకాపా (YSRCP) ప్రభుత్వానికి సూచించారు. ‘‘వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడం వల్ల ప్రయాణికులు సుమారు 2 కి.మీ మేర అదనపు దూరం వెళ్లాల్సి వస్తుంది. విశాఖ ఎంపీ నిర్మిస్తున్న బిల్డింగ్ సేల్స్ పెంచుకోవడం కోసం ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నారు. వాస్తు దోషం తొలగించుకోవడానికి రోడ్లు మూసివేయడం అన్యాయం. పోలీసు ఉన్నతాధికారులు ఆలోచన చేయాలి. డివైడర్ తొలిగించే వరకు జనసేన (Janasena) పోరాడుతుంది. ఈ ప్రభుత్వానికి ఇంకా మూడు నెలలు మాత్రమే గడువు మిగిలి ఉంది’’ అని నాదెండ్ల వ్యాఖ్యానించారు.