Sports

సెహ్వాగ్‌దే పైచేయి

సెహ్వాగ్‌దే పైచేయి

సడెన్‌గా చూస్తే అండర్‌–16 టోర్నీ ఏంటి? ద్రవిడ్, సెహ్వాగ్‌లు ముఖాముఖిగా తలపడటం ఏంటనే సందేహాలు రావడం ఖాయం. కానీ ఇది దిగ్గజాల మధ్య సమరం కాదు. వారి తర్వాతి తరం పోటీపడుతున్న టోర్నీ సంగతి! టీమిండియాకు ఏళ్ల తరబడి రాహుల్‌ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్‌ కలిసి టాపార్డర్‌ను నడిపించారు. గెలిపించారు.

ఇప్పుడు బీసీసీఐ దేశవాళీ జూనియర్‌ టోర్నీ అయిన విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీలో కర్ణాటక అండర్‌–16 జట్టు కెపె్టన్‌గా అన్వయ్‌ ద్రవిడ్‌ (ద్రవిడ్‌ రెండో కుమారుడు), ఢిల్లీ అండర్‌–16 జట్టు ఓపెనర్‌గా ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ (సెహ్వాగ్‌ పెద్ద కుమారుడు) బరిలోకి దిగారు.

దీంతో మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌ వార్తల్లో విశేషంగా నిలిచింది. మూడు రోజుల ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 56.3 ఓవర్లలో 144 పరుగుల వద్ద ఆలౌటైంది. అయితే వికెట్‌ కీపర్, కెపె్టన్‌ అన్వయ్‌ (0) డకౌటయ్యాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఢిల్లీ 30 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 107 పరుగులు చేసింది. ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ (98 బంతుల్లో 50 బ్యాటింగ్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ అర్ధసెంచరీ చేశాడు. తొలిరోజు ఆటను పరిశీలిస్తే… ఒక విధంగా టీనేజ్‌ ద్రవిడ్‌ టీమ్‌పై కుర్ర సెహ్వాగ్‌ పైచేయి సాధించాడు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z