హైవేల మీద పెట్రోల్ పంపులు, గ్యాస్ రీఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నట్టే రోదసిలోనూ పంపులు ఉంటే ఎలా ఉంటుంది? రోడ్ల మీద కార్లు, ట్రక్కులు తిరుగుతాయి కాబట్టి పెట్రోల్ పంపులు అవసరం.. అంతరిక్షంలో ఎందుకు? అనేగా మీ అనుమానం. అయితే, రోదసిలో అధునాతన గ్యాస్ స్టేషన్లు, ఇంధన స్టేషన్ల నిర్మాణానికి ఓ అమెరికా స్టార్టప్ కంపెనీ ముందుకొచ్చింది. ఆ కంపెనీ నిర్ణయంపై అంతరిక్ష పరిశోధకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కూడా. ఎందుకు??
ఏమిటీ ఈ ప్రాజెక్ట్?
భూమి నిర్ణీత కక్ష్యలో ఇంధన డిపో, గ్యాస్ స్టేషన్‌ల ఏర్పాటు కోసం అమెరికాకు చెందిన స్టార్టప్ సంస్థ ‘ఆర్బిట్ ఫ్యాబ్’ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. అమెరికాకు చెందిన ఎయిర్‌ఫోర్స్ రిసెర్చ్ ల్యాబోరేటరీతో కలిసి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నది.
ఎందుకు?
ఇంధనం అయిపోయిన ఉపగ్రహాలు, వాహకనౌకలు రోదసిలో అదేపనిగా తిరుగుతున్నాయి. శిథిలాలుగా మారిన వాటితో అంతరిక్ష కాలుష్యం మినహా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతున్నది. ఒకవేళ వాటిని గ్యాస్ లేదా ఇంధనంతో తిరిగి నింపితే, సేవలను కొనసాగించవచ్చన్న అభిప్రాయం ఇప్పటికే చాలా మంది అంతరిక్ష నిపుణుల్లో ఉన్నది. అయితే, భూమి మీద పెట్రోల్ పంపులు ఉన్నట్టు రోదసిలో ప్రత్యేక ఫ్యుయెల్ పోర్టులు లేకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకొన్నారు. దీంతో భూ కక్ష్యలో వేలాది ఉపగ్రహాలు, వాహకనౌకలు నిరుపయోగంగా తిరుగుతూ.. వాడుకలో ఉన్న శాటిలైట్ల సేవలకు ప్రమాదకరంగా మారుతున్నాయి. దీనికి పరిష్కారాన్ని చూయించడంలో భాగంగానే ‘ఆర్బిట్ ఫ్యాబ్’ కంపెనీ ఈ రోదసి గ్యాస్ స్టేషన్లను తీసుకురాబోతున్నది.
లాభాలేంటి?
అంతరిక్ష కాలుష్యం తగ్గుతుంది.
రోదసిలోనే స్టేషన్‌ను ఏర్పాటు చేయడం వల్ల చవగ్గానే ఇంధనం నింపొచ్చు.
నిరుపయోగంగా ఉన్న శాటిలైట్లను వాడుకలోకి తేవడంతో.. కొత్త ప్రయోగాల కోసం వ్యయం చేయాల్సిన పని ఉండదు.
వాడుకలో ఉన్న శాటిలైట్‌లకు కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు.
ప్రాజెక్టు వ్యయం: రూ.166 కోట్లు
ప్రారంభం: 2024 (అంచనా)
👉 – Please join our whatsapp channel here –