ఒక్కోసారి మనం వాట్సప్ (Whatsapp) ఓపెన్ చేసినప్పుడు గ్రూప్ నిండా మెసేజులు దర్శనమిస్తుంటాయి. అలాంటి సందర్భంలో దేనిపై చర్చ జరుగుతుందో తెలుసుకోవడం కాస్త కష్టమే. పైకి స్క్రోల్ చేస్తూ వెళ్తే గానీ అసలు విషయం తెలియదు. కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ను కూడా మిస్ అయిపోతూ ఉంటాం. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ వాట్సప్ కొత్తగా పిన్ చాట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది.
వ్యక్తిగత చాట్లు, గ్రూపుల్లో జరిగే సంభాషణలను వ్యక్తులు మిస్ అవ్వకుండా ఉండేందుకు వాట్సప్ తీసుకొచ్చిన పిన్ ఫీచర్ ఉపయోగపడుతుంది. గ్రూప్‌లోని సభ్యులు ముఖ్యమైన సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఉండేందుకు ఈ ఫీచర్‌ను గ్రూప్ అడ్మిన్లు వినియోగించొచ్చు. కేవలం టెక్ట్స్ మెసేజ్‌లే కాకుండా, వాట్సప్ పోల్స్, ఫొటోలు, ఎమోజీలు ఇలా అన్నింటినీ పిన్ చేయొచ్చు. ఇలా పిన్ చేసిన మెసేజ్ వాట్సప్ చాట్‌లోని పై భాగంలో కనిపిస్తుంది.
ఇలా పిన్ చేసినవి డిఫాల్ట్‌గా 7 రోజులు ఉంటాయి. కావాలనుకుంటే 24 గంటలు, 30 రోజులు ఉండేలా సెట్ చేయొచ్చు. టైమ్ లిమిట్ అయిపోగానే పిన్ చేసిన మెసేజ్ అన్‌పిన్ అవుతుంది. గ్రూప్‌లోని సభ్యులకు పిన్ చేసే నియంత్రణ అందించడం అడ్మిన్ చేతిలోనే ఉంటుంది. ఏదైనా చాట్‌లోని మెసేజ్‌ని లాంగ్ ప్రెస్ చేసి ‘More options’ పై క్లిక్ చేయగానే అందులో ‘Pin’ అనే కొత్త ఫీచర్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకుంటే మీ మెసేజ్ పిన్ అవుతుంది. అదే తరహాలో అన్‌పిన్ కూడా చేయొచ్చు. ఈ ఫీచర్‌ను మొబైల్, డెస్క్‌టాప్ యూజర్లకు వాట్సప్ తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ ఫీచర్ కొందరికి అందుబాటులోకి రాగా.. త్వరలో మిగిలినవారూ దీన్ని వినియోగించొచ్చు.
👉 – Please join our whatsapp channel here –