భారతీయుల కలలు కల్లలు చేస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే రెండేళ్లల్లో వలసలను సగానికి సగం తగ్గించేలా వీసా నిబంధనల్లో కీలక మార్పులకు సిద్ధమైంది. విదేశీ విద్యార్థులు, తక్కువ నైపుణ్యాలున్న విదేశీయులే టార్గెట్‌గా రూల్స్‌ను మరింత కఠినం చేసేందుకు నిర్ణయించింది. తాజాగా నిబంధనలు అమల్లోకి వస్తే ఇక విదేశీ విద్యార్థులు ఆస్ట్రేలియా వీసా కోసం మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ భాష పరీక్షలో మునుపటికంటే అధికమార్కులు సాధించాల్సి ఉంటుంది. విదేశీ విద్యార్థుల వీసా కొనసాగింపుె వెసులుబాటును కూడా తగ్గించేందుకు సిద్ధమైంది.
అయితే, అత్యధిక నైపుణ్యాలున్న వారికి వీసా పొందడం మరింత సరళతరం చేసేందుకు ఆస్ట్రేలియా సిద్ధమైంది. వారంలోపే దరఖాస్తు పరిశీలన పూర్తయ్యేలా ఓ కొత్త స్పెషలిస్టు వీసా అందుబాటులోకి తెచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ వీసా ద్వారా దేశంలోని వ్యాపార సంస్థలు సులభంగా విదేశీ నిపుణులను నియమించుకునేలా ఈ వీసాకు రూపకల్పన చేస్తోంది.
గతేడాది గరిష్ఠంగా 510,000 మంది విదేశీయులు ఆస్ట్రేలియాకు వలసెళ్లారు. అయితే, వచ్చే రెండేళ్లల్లో ఈ సంఖ్య సగానికి పడిపోవచ్చని ఆస్ట్రేలియా ప్రభుత్వం అంచనా వేస్తోంది. కఠిన వీసా నిబంధనలు ఇప్పటికే తమ ప్రభావం చూపిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆస్ట్రేలియా అవసరాలకు తగినట్టు వలసల్లో సుస్థిరత సాధించడమే తమ లక్ష్యమని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొని ఆల్బనీస్ ఇటీవల వ్యాఖ్యానించారు. కుప్పకూలిన వలసల వ్యవస్థ బాగుచేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ విధానంలో సమతౌల్యం సాధించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామని వలసల శాఖ మంత్రి ఓనీల్ కూడా పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –