Movies

ఆడిషన్ అంటే ఏమిటో తెలియకుండా వెళ్లి ఆడిషన్స్‌లో పాల్గొన్న!

ఆడిషన్ అంటే ఏమిటో తెలియకుండా వెళ్లి ఆడిషన్స్‌లో పాల్గొన్న!

‘‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’..ఇదే నా తొలి సినిమా. కరణ్‌ జోహార్‌ తెరకెక్కించిన ఈ చిత్రం కోసం స్కూల్‌ యూనిఫామ్‌లోనే ఆడిషన్స్‌లో పాల్గొన్నా’ అని అంటోంది బాలీవుడ్‌ అగ్రకథానాయిక అలియా భట్‌. తొలి సినిమా నుంచి భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ స్టార్‌ కథానాయికగా ఎదిగింది అలియా. తన నటనకిగానూ జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది. నటనతోనే కాదు నిర్మాతగానూ మెప్పిస్తోందీమె. ఇటీవల జడ్డాలో జరిగిన రెడ్‌ సీ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2023లో పాల్గొన్న అలియా తన మొదటి సినిమా ఆడిషన్‌ ఎలా జరిగిందనే జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంది. ‘నేను 11వ తరగతి చదువుతున్న సమయంలో ఒకరోజు నాకు కరణ్‌ జోహార్‌తో మీటింగ్‌ ఉన్నట్లు ఫోన్‌కాల్‌ వచ్చింది. స్కూల్‌లో ఉన్న నేను యూనిఫామ్‌తో కరణ్‌ని కలవడానికి ఆయన ఆఫీస్‌కి వెళ్లాను. అప్పుడు నేను ఎక్కువ ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తింటూ చాలా బొద్దుగా ఉండేదాన్ని. నన్ను చూసిన వెంటనే ఆడిషన్‌ ఇవ్వుమని అన్నారు. ఆడిషన్‌ అంటే ఏమిటో తెలియకుండానే లోపలికి వెళ్లి ఆడిషన్స్‌లో పాల్గొన్నాను. నేను ఆ సినిమాలో నాయికగా ఎంపికయ్యానని కరణ్‌ చెప్పిన ఆ క్షణం నాకు కన్నీళ్లాగలేదు. ఆనందంతో ఒక కప్‌ కేక్‌ తినొచ్చా అని కరణ్‌ అడిగా(నవ్వుతూ). ఆ విషయం తెలిసిన మా అమ్మ నేను సినిమాల్లో నటించడానికి కొంచెం సంకోచించినా మా నాన్న మాత్రం అంగీకరించారు’ అంటూ గుర్తుచేసుకుంది. ప్రస్తుతం ‘జిగ్రా’ చిత్రీకరణలో బిజీగా ఉంది అలియా.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z