అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ ఏమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం మొట్టమొదటి మంత్రివర్గం సమావేశంలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీ ఏమైందని ఆయన నిలదీశారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టిందని, అసలు ఆట ఇప్పుడుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలోని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి అప్పగించారనే పాత చింతకాయ పచ్చడినే శుక్రవారం జరిగే అసెంబ్లీ ఉభయ సభల సమావేశాల్లో గవర్నర్ నోటితో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిస్తుందని ఎద్దేవా చేశారు.
వివిధ ప్రభుత్వ శాఖల పద్దులపై గతంలో కాంగ్రెస్ హయాంలో ఏనాడూ చర్చ జరగలేదని, తాము మాత్రం పద్దులపై ప్రతీ ఏటా శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కాగ్ నివేదికలను ఇచ్చామన్నారు. ప్రతీ ఏడాది తమ ప్రభుత్వం ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ శ్వేతపత్రం లాంటిదేనని, ప్రతీ అసెంబ్లీ సమావేశంలో అప్పుల వివరాలు సమర్పించామన్నారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి ఇచ్చిన నివేదికను కాంగ్రెస్ నేతలు చదవకపోతే ఏం చేస్తామన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని పరోక్షంగా ఉద్దేశిస్తూ ‘ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 45వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. ఇలాంటి హామీలు అనేకం ఉన్నాయి. పాలకుర్తిలోనూ నిరుద్యోగం ఉండటమేంటి, ఉద్యోగాల మేళా పెడతాం అని అక్కడి ఎమ్మెల్యే అంటున్నారు.. వేచి చూద్దాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –