శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ (Ttd) ముఖ్య సూచన చేసింది. ఈనెల 19న దర్శనం(Darsan) నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ప్రతి ఏటా నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(Koil Alwar Thirumanjanam) నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం రోజున(19)న ఆలయ శుద్ధి కార్యక్రమంలో భాగంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 19న ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఆలయ శుద్ధిలో భాగంగా ఆలయ దర్శనం 5 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు ఆలయ అర్చకులు ప్రకటించారు. ఆనంద నిలయం నుంచి ప్రారంభించి బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేస్తారని వివరించారు. ఆలయాన్ని శుభ్రం చేసే సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పివేస్తారని పేర్కొన్నారు.
ఆలయ శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా చల్లుతారని తెలిపారు. అనంతరం స్వామి వారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను చేపడతారని అన్నారు. ఆ తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తామని వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –