Business

భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల కారణంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.22 సమయంలో సెన్సెక్స్‌ 665 పాయింట్ల లాభంతో 70,249 వద్ద, నిఫ్టీ 186 పాయింట్లు ఎగసి 21,112 వద్ద ట్రేడవుతున్నాయి. పీటీసీ ఇండస్ట్రీస్‌, పైసాలో డిజిటల్‌, టాన్లా ప్లాట్‌ఫామ్స్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, ఎన్‌బీసీసీ (ఇండియా) షేర్లు భారీ లాభాల్లో ఉండగా.. ఛంబల్‌ ఫర్టిలైజర్స్‌, హిండ్‌ జింక్‌, మిస్‌ బెక్టార్స్‌ ఫుడ్‌, అరవింద్‌ లిమిటెడ్‌, ధాని సర్వీసెస్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయ మారకం విలువ 83.38 వద్ద కొనసాగుతోంది.

అమెరికా ఫెడ్‌ నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్‌ సూచీలపై సానుకూల ప్రభావం చూపింది. ఆసియా-పసిఫిక్‌లో ఒక్క జపాన్‌ సూచీ మినహా మిగిలిన ప్రధాన సూచీలు మొత్తం లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.

ఫెడ్‌ రేట్లు యథాతథం..
యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ తన కీలక రేట్లలో మార్పు చేయలేదు. రెండు రోజుల పాటు జరిగిన ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (ఎఫ్‌ఓఎమ్‌సీ) సమావేశ నిర్ణయాన్ని భారత కాలమాన ప్రకారం.. బుధవారం అర్థరాత్రి దాటాక వెలువరిచింది. ద్రవ్యోల్బణం ఇంకా 2 శాతం లక్ష్యం కంటే ఎగువనే ఉన్నందున, కఠిన వైఖరిని కొనసాగిస్తూ.. విధాన రేట్లను ప్రస్తుత 5.25-5.50 శాతం శ్రేణిలోనే ఉంచుతున్నట్లు పేర్కొంది. వరుసగా మూడో సారీ రేట్లను ఇదే స్థాయిలో కొనసాగించింది. ఇవి 22 ఏళ్ల గరిష్ఠ స్థాయి రేట్లు 2024లో 2 సార్లు రేట్ల కోతకు అవకాశం ఉండొచ్చనే సంకేతాలిచ్చింది.

* పెంటప్రజోల్‌ సోడియమ్‌ జనరిక్‌ ఔషధానికి అమెరికాలో అనుమతి లభించినట్లు గ్రాన్యూల్స్‌ ఇండియా తెలిపింది. ఈ మందును 20ఎంజీ, 40ఎంజీ డోసులో విక్రయించడానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతి ఇచ్చినట్లు పేర్కొంది.

* ప్రముఖ రిటైల్‌ స్టోర్‌ ‘వాల్యూ జోన్‌ హైపర్‌ మార్ట్‌’ పటాన్‌చెరులో ఈ నెల 15న ప్రారంభం కానుంది. ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ వాల్యూజోన్‌కు ప్రచారకర్తగా ఉండటంతో పాటు ఈ స్టోర్‌ను ప్రారంభించనున్నారు.

* వచ్చే ఏడాది గడువు తీరనున్న 1.9 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.15,800 కోట్ల) విదేశీ కరెన్సీ బాండ్ల చెల్లింపుల నిమిత్తం అదానీ గ్రూప్‌ ప్రణాళికలు రచిస్తోంది. నగదు చెల్లింపులు, కొత్త బాండ్ల విక్రయాల మిశ్రమంగా ఈ చెల్లింపులు ఉండొచ్చు. 2019లో అదానీ గ్రీన్‌ విక్రయించిన బాండ్లకు వచ్చే సెప్టెంబరులో గడువు తీరనుందని.. ఇందు కోసం 750 మి. డాలర్ల నగదు, నగదు సమాన నిల్వలను సిద్దం చేయడానికి పనిచేస్తున్నట్లు ఎక్స్ఛేంజీలకు తెలిపింది.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) మన ఆర్థిక వ్యవస్థ 6.7 శాతం వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందని ఏషియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) అంచనా వేసింది. సెప్టెంబరులో అంచనా వేసిన 6.3 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువ కావడం గమనార్హం.

* ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇప్పటి వరకు దేశ సేవల ఎగుమతులు 192 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.15.95 లక్షల కోట్ల)కు చేరాయని సేవల ఎగుమతి ప్రోత్సాహక మండలి (ఎస్‌ఈపీసీ) వెల్లడించింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఇవి 400 బి.డాలర్ల స్థాయిని చేరొచ్చని అంచనా వేసింది. టెలికాం, కంప్యూటర్‌, సమాచార, రవాణా, ప్రయాణ రంగాలు ఆరోగ్యకర వృద్ధిని నమోదు చేస్తున్నాయని పేర్కొంది.

* డోమ్స్‌ ఐపీఓకు 5.71 రెట్ల స్పందన: డోమ్స్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓ మొదటి రోజే 5.71 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 88,37,407 షేర్లు జారీ చేయనుండగా, 5,04,55,458 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్‌ విభాగంలో 19.13 రెట్ల స్పందన కనిపించింది.

* దివాలా పరిష్కారా ప్రక్రియలో రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌)కు చెందిన కొన్ని స్థిరాస్తుల విక్రయానికి జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌, ముంబయి బెంచ్‌ ఆమోదం తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z