‘యానిమల్’ (Animal) సినిమా తర్వాత ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు ‘త్రిప్తి డిమ్రీ’ (Tripti Dimri). సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సూపర్ హిట్ చిత్రంలో జోయా పాత్రలో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఐఎండీబీ (ఇండియన్ మూవీ డేటాబేస్) విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాలోనూ త్రిప్తి మొదటి స్థానంలో నిలిచారు. నేషనల్‌క్రష్‌గా మారిన ఈ అమ్మడి తర్వాతి చిత్రాల గురించి అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను పలు సౌత్ సినిమాల్లో ఎంపికయ్యానంటూ వస్తోన్న వార్తలపై స్పందించారు.
‘నేను ఇప్పటి వరకు ఏ దక్షిణాది సినిమాకు సంతకం చేయలేదు. సౌత్‌లోనూ అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. నాకు జూనియర్ ఎన్టీఆర్‌తో (NTR) కలిసి నటించాలని ఉంది’ అని తెలిపారు. ఇక ‘యానిమల్’ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నా నటనకు ప్రశంసలు దక్కడం ఎంతో ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ఇక ఈ సినిమా తర్వాత త్రిప్తికు సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగింది. ‘యానిమల్’కు ముందు ఆమె ఫాలోవర్స్ ఆరు లక్షలమంది కాగా.. ఈ చిత్రం తర్వాత ఆ సంఖ్య 36 లక్షలకు పెరిగింది. మరోవైపు ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ (Prashant Neel) కాంబోలో రానున్న సినిమాలో త్రిప్తిని తీసుకోవాలంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –