Sports

అండర్-19 ప్రపంచకప్ జట్టులో ఇద్దరు హైదరాబాద్ కుర్రాళ్లు

అండర్-19 ప్రపంచకప్ జట్టులో ఇద్దరు హైదరాబాద్ కుర్రాళ్లు

అండర్‌–19 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నీలో పాల్గొనే భారత జట్టులో ఇద్దరు తెలుగు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన అరవెల్లి అవినాశ్‌ రావు, మురుగన్‌ అభిషేక్‌ ఐసీసీ ఈవెంట్లో భాగమయ్యే ఛాన్స్‌ కొట్టేవారు. కాగా వికెట్‌ కీపర్‌ అవినాశ్, ఆఫ్‌స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అభిషేక్‌.. ఈ ఇద్దరూ కూడా ఆసియా కప్‌లో భారత్‌ ఆడిన 3 మ్యాచ్‌లలోనూ బరిలోకి దిగారు.

కాగా అండర్‌–19 వరల్డ్‌కప్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే యువ ఆటగాళ్ల పేర్లను బీసీసీఐ జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం దుబాయ్‌లో అండర్‌–19 ఆసియా కప్‌లో పాల్గొంటున్న జట్టునే.. ఒక్క మార్పూ లేకుండా ఈ మెగా టోర్నీ కోసం కూడా ఎంపిక చేయడం విశేషం.

ఇక 15 మంది సభ్యుల ఈ ప్రపంచకప్‌ జట్టుకు పంజాబ్‌కు చెందిన ఉదయ్‌ సహరన్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అతడికి డిప్యూటీగా సౌమీ కుమార్‌ పాండే వైస్‌ కెప్టెన్‌గా అవకాశం దక్కించుకున్నాడు. కాగా దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు వరల్డ్‌కప్‌ను నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది.

అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీలో పాల్గొనే భారత జట్టు:
ఉదయ్‌ సహారన్‌ (కెప్టెన్‌), సౌమీ కుమార్‌ (వైస్‌ కెప్టెన్‌), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్, రుద్రమయూర్‌ పటేల్, సచిన్, ప్రియాన్షు, ముషీర్‌ ఖాన్, అవినాశ్‌ రావు, మురుగన్‌ అభిషేక్‌, ఇనేశ్‌ మహాజన్, ధనుశ్‌ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్‌ లింబాని, నమన్‌ తివారి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z