DailyDose

వైసీపీ ఇంచార్జులను మార్చడంపై స్పందించిన చంద్రబాబు-తాజా వార్తలు

వైసీపీ ఇంచార్జులను మార్చడంపై స్పందించిన చంద్రబాబు-తాజా వార్తలు

* వైసీపీ ఇంచార్జులను మార్చడంపై స్పందించిన చంద్రబాబు

మొత్తం 151 మందిని మార్చినా వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ గెలవరని టీడీపీ అధినేత చంద్రబాబు జోస్యం చెప్పారు. సీఎం జగన్ 11 మంది వైసీపీ ఇంచార్జులను మార్చడంపై ఆయన స్పందించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో ఓటమి భయం పట్టుకుందని.. అందుకే 11 మంది ఇంచార్జులను మార్చారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఒక నియోజకవర్గంలో చెల్లని కాసులు.. మరో చోట చెల్లుతాయా అని ప్రశ్నించారు. ప్రజలను వైసీపీ ఎమ్మెల్యేలు భయబ్రాంతులకు గురి చేశారని.. తిరుగుబాటు మొదలుకావడంతో సీఎం జగన్ మార్పులకు తెరతీశారని చంద్రబాబు ఆరోపించారు. జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతోనే ఐదుగురు దళిత నేతలను బదిలీ చేశారని వ్యాఖ్యానించారు. బీసీలపై ప్రేమ ఉందని చెప్పుకునే వైసీపీ నాయకులు పులివెందుల సీటును వారికి ఇవ్వమని సీఎం జగన్‌ను అడిగే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. బలా బలాలను బట్టే పార్టీ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, కుప్పంలోనూ ప్రజాభిప్రాయం సేకరిస్తామని చెప్పారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిని బట్టి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.

బేకరీలో ప్రమాదంపై రేవంత్ దిగ్భ్రాంతి

 రాజేంద్రనగర్‌లోని కరాచీ బేకరీ గోడౌన్‌లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 15 మంది కార్మికులకు మెరుగైన వైద్య చికిత్సలు అందచేయాలని సంబంధిత ఆధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గాయపడ్డ వారిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కార్మికులు ఉన్నారని సీఎంకు అధికారులు తెలియజేశారు. గాయపడ్డ వారిలో 8 మందిని కంచన్ బాగ్ డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య సదుపాయాలు అందచేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.కాగా.. రాజేంద్రనగర్‌లోని కరాచీ బేకరీలో సిలిండర్ పేలింది. కరాచీ బేకరీ క్యాంటీన్లో ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు 15 మందికి గాయాలవగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. తీవ్రంగా గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదం తర్వాత సిబ్బంది, యాజమాన్యం ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. గుట్టుచప్పుడు కాకుండ బాధితులను సిబ్బంది ఆస్పత్రికి తరలించిన.. నిర్వాహకులు కిచెన్‌తో పాటు గోదాంకు తాళం వేసుకొని వెళ్లిపోయారు

పవన్‌పై జగన్‌ సెటైర్లు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని తన పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపాడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. అయితే, జనసేన పోటీ చేసిన ఎనిమిది స్థానాలకు గాను కూకట్‌పల్లిలో చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు తప్పితే.. ఎక్కడా ప్రభావాన్ని చూపలేకపోయింది.. చెప్పుకోదగిన ఓట్లు కూడా సాధించలేకపోయింది.. ఇదే, సమయంలో.. చివరి నిమిషంలో ఎన్నికల్లో పోటీ చేసిన యూట్యూబర్‌ బరెలక్క 5 వేలకు పైగా ఓట్లు సాధించారు.. దీంతో.. అప్పటి నుంచి పవన్‌ కల్యాణ్.. ప్రత్యర్థులకు టార్గెట్‌గా మారిపోయాడు.. పవన్‌ కంటే బర్రెలక్క బెటర్‌ అంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ కామెంట్‌ చేయగా.. తాజాగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు.. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. పలాసలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. బర్రెలక్క, పవన్‌ కల్యాణ్‌ పేర్లను ప్రస్తావించారు.మాట ఇస్తే మాట మీద నిలబెట్టుకునే చరిత్రలేదు చంద్రబాబుకు అంటూ ఫైర్‌ అయ్యారు సీఎం జగన్‌.. ఎన్నికలు వచ్చేసరికి తన ఆధారపడేది.. పొత్తులు, ఎత్తులు, ‌జిత్తులు, కుయక్తులే అంటూ ఆరోపించారు.. ఒక దత్తపుత్రుడుని పెట్టుకొని డ్రామాలు కూడా ఆడతారు.. ఈ‌ దత్తపుత్రుడు తెలంగాణాలో పుట్టనందుకు బాధపడతానని తెలంగాణలో మాట్లాడతాడు.. నాన్‌లోకల్ ప్యాకేజీ స్టార్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ప్యాకేజీ స్టార్ చాలా డైలాగులు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడాడు.. కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్కకు పడినన్ని ఓట్లు కూడా జనసేన పార్టీ అభ్యర్థులకు రాలేదు, అసలు డిపాజిట్ కూడా రాలేదు అంటూ పవన్‌ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు సీఎం వైఎస్‌ జగన్‌.ఇక, విశాఖ పరిపాలన రాజధాని పెడదామంటే ప్రతిపక్ష నేతలు అడ్టుకుంటున్నారు. ఈ ఉత్తరాంధ్రలో పోర్ట్‌, ఎయిర్‌పోర్ట్‌ వస్తాదంటే ఏడుస్తారు అని మండిపడ్డారు సీఎం జగన్‌.. ఇక్కడ నివాసం ఉంటానంటే ఏడుస్తారు. వేరే రాష్ట్రంలో నివాసం ఉంటూ , ఓ దొంగల ముఠాగా తయారై మనమీద పడి ఏడుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి నాన్ లోకల్స్ ఏం చేయాలో మనకు చెబుతారు. ఈ నాన్ లోకల్స్ చెప్పినట్లు మనం చేయాలా..? అని ప్రశ్నించారు. గ్రామ, వార్డు సచివాయాలు తీసుకువచ్చి, వాలంటీర్లను ఏర్పాటు చేస్తే ఏడుపే నంటూ విపక్షాలపై ఫైర్‌ అయ్యారు సీఎం వైఎస్‌ జగన్‌.

* హైదరాబాద్ కుర్రోళ్ళుకు కేటీఆర్ అభినందనలు

వచ్చే ఏడాది జనవరి 19 నుంచి దక్షిణాఫ్రికా వేదికగా జరిగే అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌లో పోటీపడే భారత జట్టులో హైదరాబాద్‌ కుర్రాళ్లు ఆరవెల్లి అవినాశ్‌ రావు, మురుగన్‌ అభిషేక్‌లకు చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ఇద్దరికి విషెస్ తెలియజేశారు. ‘అండర్‌-19 క్రికెట్‌ వరల్డ్‌కప్‌ జట్టు, సౌతాఫ్రికాతో ట్రై సిరీస్‌ ఆడే జట్టు ఎంపికైనందుకు అరవెల్లి అవినాశ్‌ రావుకు శుభాకాంక్షలు. ఈ యువ క్రికెటర్‌ రాజన్న సిరిసిల్ల నియోజకవర్గం పోత్గల్‌ గ్రామంలో పుట్టి పెరిగాడు’ అంటూ పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న అవినాశ్ వికెట్ కీపర్‌గా, అభిషేక్ ఆల్ రౌండర్‌గా రాణిస్తున్నారు.

గన్నవరంలో అంగన్వాడీల సమ్మెకు టీడీపీ మద్దతు 

గన్నవరంలో అంగన్వాడీల నిరవధిక సమ్మెకు టీడీపీ మద్దతు తెలిపింది. సీడీపీవో కార్యాలయం ఎదుట సమ్మెలో పార్టీ ఇన్ ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో వైసీపీ మీనమేషాలు లెక్కపెడుతోందని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధినేత చంద్రబాబుతో మాట్లాడి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలను విస్మరించిందన్నారు. తెలుగునాడు అంగన్వాడీ సంఘ రాష్ట్ర, జిల్లా అధ్యక్షురాలు ఆచంట సునీత, పొదిలి లలిత తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.

పార్లమెంట్ నుంచి 15 మంది ఎంపీల సస్పెండ్

పార్లమెంట్లో వికృతంగా ప్రవర్తించినందుకు 15 మంది ఎంపీలు సస్పెన్షన్‌కి గురయ్యారు. సస్పెండ్ అయిన వారిలో ఒక రాజ్యసభ ఎంపీతో పాటు 14 మంది లోక్‌సభ ఎంపీలు ఉన్నారు. సస్పెండ్ అయిన సభ్యుల్లో మాణికం ఠాగూర్, కనిమొళి, పీఆర్ నటరాజన్, వీకే శ్రీకాంతం, బేణి బహన్, కే సుబ్రమణ్యం, ఎస్ఆర్ ప్రతిబన్, ఎస్ వెంకటేషన్, మహ్మద్ జావేద్ ఉన్నారు. ఎంపీల్లో 9 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. సీపీఎంకు చెందిన ఇద్దరు, డీఎంకేకి చెందిన ఇద్దరు, సీపీఐ నుంచి ఒక ఎంపీ ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ రాజ్యసభ నుంచి సస్పెండ్ అయ్యారు. బుధవారం పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై చర్చ నిర్వహించాలని ప్రతిపక్ష ఎంపీలు సభలో డిమాండ్ చేస్తున్నారు.బుధవారం పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అది కూడా 2001, డిసెంబర్13 పార్లమెంట్ ఉగ్రదాడి జరిగిన రోజే ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు విజిటర్ పాసులతో పార్లమెంట్ లోకి ప్రవేశించి, పొగ డబ్బాలతో హల్చల్ చేశారు. మరో ఇద్దరు పార్లమెంట్ వెలుపల ఇదే విధంగా ప్రవర్తించారు. ఈ కుట్రలో మొత్తం ఆరుగురు ప్రమేయం ఉంది. ప్రస్తుతం నలుగురితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆరో వ్యక్తి పరారీలో ఉన్నారు.

ఆరు గ్యారెంటీలకు నిధులు ఇటలీ నుంచి తెస్తారా?

ఆరు గ్యారెంటీలకు నిధులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి తెస్తారా లేక ఇటలీ నుంచి తెస్తారా సమాధానం చెప్పాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అసెంబ్లీ మీడియా సెంటర్‌లో గురువారం ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారని, ఇచ్చిన గ్యారెoటీలను కాంగ్రెస్ ఎలా అమలుచేస్తుందో చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఉండగా ప్రమాణం చేయబోమని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నట్లుగా చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీతో అధికారంలోకి వచ్చారని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీతో తమ యుద్ధం మొదలైందని రాజాసింగ్ చెప్పారు.నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, హామీల అమలు జరిగే వరకు ప్రజల పక్షాన నిలబడతామని వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్‌ను స్టడీ సర్కిల్‌గా మారుస్తామని హామీ ఇచ్చి మరిచారని మండిపడ్డారు. రైతు బంధులో కోత విధించడం సరికాదని మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు.

రాజ్యసభ నుంచి ఎంపీ సస్పెండ్‌

పార్లమెంట్‌ భద్రత వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా జవాబు చెప్పాలని తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు స్లోగన్స్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు. పార్లమెంట్‌లో బుధవారం చోటచేసుకున్న ఘటనపై కేంద్ర మంత్రి ఆమిత్ షా స్పందించాలని రాజ్యసభలో టీఎంసీ ఎంపీలు పట్టుబాట్టారు. ఈ క్రమంలో టీఎంసీ ఎంపీ  డెరెక్‌ ఒబ్రయిన్‌పై వేటు పడింది. ఆయనను సస్పెండ్‌ చేసినట్లు రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ప్రకటించారు. రాజ్యసభలో ‘వికృతమైన ప్రవర్తన’కు గాను ఎంపీ డెరెక్‌ను ఈ పార్లమెంట్‌ శీతాకాల సమాశాలకు సస్పెన్షన్ విధించినట్లు వెల్లడించారు.అమిత్‌ షా జవాబు ఇవ్వాలని.. ఆందోళన చేపట్టిన డెరెక్ ఓబ్రెయిన్ వెంటనే రాజ్యసభను వదిలి వెళ్లాలని రాజ్యసభ ఛైర్మన్‌ ఆదేశించారు. ఎంపీ డెరెక్… రాజ్యసభ చైర్‌ను ధిక్కరించారని, సభ నియమ నిబంధనలు ఉల్లంగించారని అన్నారు. ఇది తీవ్రమైన దుష్ప్రవర్తన కిందకు వస్తుందని.. సిగ్గు పడాల్సిన ఘటన అని  ఆయన్ను సెస్పెండ్‌ చేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ తెలిపారు. ఈ సస్పెన్షన్‌ వేటు..  శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు కొనసాగుతోందని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z