Devotional

శ్రీవాణి ట్రస్టు విరాళాలతో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల నిర్మాణం

శ్రీవాణి ట్రస్టు విరాళాలతో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల నిర్మాణం

తితిదే ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి)కు సమకూరిన విరాళాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 3,615 ఆలయాల నిర్మాణంతోపాటు పలు గుడుల జీర్ణోద్ధరణ చేపట్టినట్లు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. వాటి నిర్మాణ పురోగతిపై తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో గురువారం ఆయన సమీక్షించారు. శ్రీవాణి ట్రస్టు విరాళాలతో ఇప్పటివరకు 1,500 ఆలయాల నిర్మాణం పూర్తికాగా, మిగిలినవి మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ‘రాష్ట్ర దేవాదాయ శాఖ 1,973 దేవాలయాలు నిర్మించగా, సమరసత సేవా ఫౌండేషన్‌ 320 నిర్మాణాలు ప్రారంభించి, 307 పూర్తి చేసింది. గ్రామాల్లో ప్రజలు కమిటీలుగా ఏర్పడి దరఖాస్తు చేసుకుంటే ఆలయాల నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తున్నాం. పలు నగరాల్లో శ్రీవారి మందిరాలు నిర్మించామ’ని ధర్మారెడ్డి వెల్లడించారు. సమరసత సేవా ఫౌండేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీవిష్ణు మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్టు నిర్మించిన ఆలయాలపై సామాజిక తనిఖీ చేయగా, చక్కటి ఫలితాలు కనిపించాయన్నారు. ఒక్కో ఆలయానికి ధూపదీప నైవేద్యాలకు ట్రస్టు నుంచి ప్రతినెలా రూ.5 వేల ఆర్థిక సాయం చేస్తున్నట్లు చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z