DailyDose

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి గుర్తింపు కార్డు తప్పనిసరి!

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి గుర్తింపు కార్డు తప్పనిసరి!

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలనుకునే మహిళలు శుక్రవారం నుంచి గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది.. అప్పుడే జీరో టికెట్‌ జారీ చేస్తారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం నుంచి మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కరీంనగర్‌ రీజియన్‌ పరిధిలో 11 డిపోలు ఉండగా అన్ని రకాల బస్సులు కలిపి సగటున 3.50 లక్షల కిలోమీటర్ల మేర నడుస్తుండగా ఇందులో అత్యధికంగా 207 ఎక్స్‌ప్రెస్‌లు, 459 పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి. కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో రోజుకు సగటున అన్ని బస్సుల్లో కలిపి 2.60 లక్షల మంది ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు వెళ్తున్నారు.

ఇందులో దాదాపు 55 శాతం మంది మహిళా ప్రయాణికులే ఉండగా ఉచిత ప్రయాణం అమలులోకి వచ్చిన తర్వాత వీరి సంఖ్య మరో 10 శాతానికి పైగానే పెరిగినట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఎక్స్‌ప్రెస్‌, ఆర్డీనరీ బస్సుల్లో బాలికలు, యువతులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఉచిత ప్రయాణం చేసినప్పటికీ ఎలాంటి గుర్తింపు కార్డులను కండక్టర్లు అడగలేదు. టికెట్‌లు కూడా ఇవ్వలేదు. రోజూ ఎంతమంది ఉచిత ప్రయాణం చేశారనే వివరాలను కండక్లర్లు ఎస్‌ఆర్‌లో నమోదు చేశారే తప్ప టికెట్ల రూపంలో కచ్చితమైన గణాంకాలు లేకుండా పోయాయి. ఇక శుక్రవారం నుంచి బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారుగా ధ్రువీకరణను తెలిపే ఆధార్‌ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు లేదా రేషన్‌ కార్డును చూపించి జీరో టికెట్‌ తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది.

ఇదే అంశంపై అవగాహన కల్పించేలా గురువారం సాయంత్రం ఆర్టీసీ ఉన్నతాధికారులు దృశ్య సమీక్షలో అన్ని డిపోల మేనేజర్లు, ఇతర ఉద్యోగులకు పలు సూచనల్ని ఇచ్చారు. ప్రభుత్వం సూచించిన మూడు గుర్తింపు కార్డులను ప్రతీ మహిళ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని, లేకుంటే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రతీ రోజూ ఎంతమంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు.. ఎంత ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందనే లెక్కలన్నీ పక్కాగా ఉంటాయని, ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లింపులు చేసే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. అందువల్లే జీరో టికెట్‌ అమలులోకి తెచ్చినట్లు చెబుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z