Business

కాచిగూడ నుంచి అజంతా ఎక్స్‌ప్రెస్‌

కాచిగూడ నుంచి అజంతా ఎక్స్‌ప్రెస్‌

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ప్రారంభ టెర్మినళ్లను మారుస్తున్నట్లు ద.మ.రైల్వే గురువారం వెల్లడించింది. దేవగిరి ఎక్స్‌ప్రెస్‌(17058/17057) ఇక లింగంపల్లి స్టేషన్‌ నుంచి, అజంతా ఎక్స్‌ప్రెస్‌(17064/17063) కాచిగూడ స్టేషన్‌ నుంచి బయలుదేరనున్నాయి. అజంతాకు మల్కాజిగిరి స్టేషన్‌లో అదనపు హాల్ట్‌ ఇచ్చారు. హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతం స్థిరాస్తి రంగం, ఐటీ కంపెనీలతో వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఇక్కడి నుంచి రైలు ప్రయాణికులు భారీగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో దేవగిరిని లింగంపల్లి స్టేషన్‌కు మార్చడం వల్ల ముంబయికి మాత్రమే కాకుండా నిజామాబాద్‌, బాసర, మన్మాడ్‌, నాసిక్‌ వంటి ముఖ్యమైన పట్టణాలకు వెళ్లే ప్రయాణికులకు నేరుగా రైలు అనుసంధానం లభిస్తుంది. అజంతాతో కాచిగూడ స్టేషన్‌ నుంచి శిరిడీకి సమీప రైల్వేస్టేషన్‌ నాగర్‌సోల్‌ అనుసంధానమవుతుంది. దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ టెర్మినల్‌ మార్పు ఈ నెల 14 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ రైలు లింగంపల్లిలో మధ్యాహ్నం 12.25 గంటలకు బయల్దేరుతుంది. కాచిగూడ-మన్మాడ్‌ అజంతా ఎక్స్‌ప్రెస్‌ టెర్మినల్‌ మార్పు 20 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ రైలు కాచిగూడ నుంచి సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరుతుంది. మల్కాజిగిరి స్టేషన్‌లో రాత్రి 7 గంటలకు ఆగుతుంది. అదేవిధంగా ఇందులో మరో సెకండ్‌ ఏసీ బోగీని పెంచారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z