తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ విమానాశ్రయ మెట్రో అలైన్‌మెంట్ ప్లాన్ నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. టెండర్ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు అభివృద్ధి, ఇతర అంశాలపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి, సీఎస్ శాంతి కుమారి, పురపాలక శాఖ, మెట్రో అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి పలు కీలక అంశాలపై సమీక్ష చేపట్టారు. 111 జీవో పరిధిలో మెట్రో అలైన్‌మెంట్ ఎలా చేశారని సీఎం ప్రశ్నించారు. 111 జీవో పరిధిలో అభివృద్ధికి అవకాశం తక్కువన్నారు. ఓఆర్‌ఆర్ ద్వారా విమానాశ్రయానికి మంచి రవాణా సదుపాయం ఉన్నట్లు సీఎం తెలిపారు. అవసరమైతే.. విమానాశ్రయ మెట్రోలకు ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్ తయారు చేయాలని అధికారులకు సూచించారు. పాతబస్తీలో అధిక జనాభా దృష్ట్యా మెట్రో అలైన్‌మెంట్ ఉండాలని సీఎం అన్నారు. ఎంజీబీఎస్, ఫలక్‌నుమా, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట నుంచి మెట్రో అలైన్‌మెంట్ ఉండాలన్నారు. పాతబస్తీ మెట్రో పనులు చేపట్టకపోవడంపై ఎల్‌అండ్‌టీపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు, జీఎంఆర్ ఎయిర్‌పోర్టు రాయితీ ఒప్పందాలను పరిశీలించాలని, మూసీ వెంట రోడ్‌కమ్ మెట్రో కనెక్టివిటీ ఉండేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్‌కు మాస్టర్ ప్లాన్
హైదరాబాద్‌కు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. కాలుష్యాన్ని వెదజల్లే ఫార్మాసిటీ హైదరాబాద్‌కు సమీపంలో ఉండకూడదన్న సీఎం.. ఆయా ఫార్మాసిటీ భూముల్లో టౌన్‌షిప్, కందుకూరు సమీపంలో మెగా టౌన్‌షిప్ కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తెలంగాణకు డ్రై పోర్టు కోసం ప్రణాళికలు రూపొందించాలని.. పశ్చిమ, గల్ఫ్ దేశాలకు హైదరాబాద్‌ను లాజిస్టిక్ మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.
👉 – Please join our whatsapp channel here –