ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధర రికార్డు సృష్టిస్తున్నది. క్వింటా ధర రూ.3,545 లభిస్తున్నది. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ చర్రితలో ఎన్నడూలేని విధంగా భారీ స్థాయిలో రేట్లు పలుకుతున్నాయి. గత సీజన్‌లో క్వింటాకు రూ.2,600 మాత్రమే పలికింది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.2,203 ఉండగా.. మార్కెట్‌లో రూ.వెయ్యి నుంచి రూ.1,200 అధికంగా వస్తున్నది. బీపీటీని అంతగా సాగు చేయకపోవడంతో సన్నాలకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్, మిర్యాలగూడతోపాటు ఇతర రాష్ర్టాలకు ధాన్యం ఎగుమతి అవుతున్నది. దీనికి తోడు గత కేసీఆర్ సర్కారు తీసుకున్న చర్యలు రైతులకు ఫలితాలన్నిస్తున్నాయి. దీంతో కర్షకులు యార్డులకు బస్తాలతో పోటెత్తుతున్నారు. అన్ని మార్కెట్లలోనూ పెద్ద మొత్తంలో ధర లభిస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు జిల్లా వరకే ఈ సీజన్‌లో 1.90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. 3.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా..
ఇదివరకెన్నడూ లేనివిధంగా వరికి రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నది. మొదటగా క్వింటాకు రూ.1,800 నుంచి ప్రారంభమైన ధర రోజురోజుకు పెరుగుతూ ప్రస్తుతం రూ.3,545లకు చేరుకున్నది. దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌ఎన్‌ఆర్ సన్నరకం ధాన్యానికి రికార్డు స్థాయిలో ధర వస్తున్నది. రాష్ట్ర మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ధరలు పలుకుతుండటం, రైతులు మార్కెట్‌కు క్యూకట్టారు. దాంతో మార్కెట్‌కు ధాన్యం పెద్దఎత్తున అమ్మకానికి వస్తున్నది. గత సీజన్‌లో క్వింటా రూ.2,600లకు పైగా ధరలు పలుకగా, ఈ వానకాలం సీజన్‌లో రికార్డు స్థాయికి చేరుకున్నది. మరింత ధరలు పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.2,203 ఉండగా, మార్కెట్‌లో క్వింటా రూ.3,545వరకు ధర పలుకుతున్నది. కనిష్ఠంగా రూ.2,060, మధ్యస్తంగా రూ.3,391 ధర పలికింది. ఆర్‌ఎన్‌ఆర్ సన్నరకాలకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు ధరలను పెంచి కొనుగోలు చేస్తున్నారు. ఆర్‌ఎన్‌ఆర్(తెలంగాణ సోన) ఈరకం బియ్యం సన్నగా ఉండటం, క్వాలిటీ బాగా ఉండటం, నూనెశాతం తక్కువ, షుగర్ పేషంట్లలకు బాగుంటుందని డిమాండ్ పెరింగింది. అదేవిధంగా గతంలో వేసే బీపీటీ(సోనరకం) ధాన్యాన్ని రైతులు అంతగా సాగుచేయకపోవడం కూడా ఈ సన్నాలకు డిమాండ్ అధికంగా వస్తున్నది. రాష్ట్రంలోని హైదరాబాద్, మిర్యాలగూడతోపాటు ఇతర రాష్ర్టాలకు ఆంధ్రాలోని మండపేట, కర్ణాటకలోని రాయిపూర్, తదితర ప్రాంతాలకు సన్నరకం ధాన్యం ఎగుమతి అవుతుండటం కూడా సన్నాలకు మంచి ధరలు వస్తున్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సన్నాలను సాగుచేయాలని రైతులకు సూచించడం జరిగింది. దాంతోఅప్పటి నుంచి రైతులు అధికంగా సన్నరకాలను సాగుచేస్తున్నారు. అయితే యాసంగిలో ఎక్కువశాతం 1010 దొడ్డురకం ధాన్యం సాగుచేసే అవకాశం ఎక్కువగా ఉండటంతో వచ్చే సీజన్‌ను కూడా దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు సన్నరకాలకు ధరలు అధికంగా వేసి కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది వానాకాలంలో లక్షా 90వేల ఎకరాల్లో వరిసాగు చేశారు. గతేడాది వానాకాలంలో లక్షా 80వేల ఎకరాల్లో సాగుచేశారు. ఎకరాకు దాదాపుగా 40 నుంచి 45బస్తాల దిగుబడి వస్తున్నది. జిల్లాలో దాదాపు 3లక్షల 90వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానున్నది.
మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా..
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యానికి అత్యధిక ధరలు పలుకుతున్నాయి. మార్కెట్ చ రిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆర్‌ఎన్‌ఆర్ కు అధిక ధరలు వ స్తున్నాయి. ఇప్పటి వరకు ఇదే అత్యధికం.
ధాన్యం నాణ్యతను బట్టి ధరలు..
ఆర్‌ఎన్‌ఆర్‌కు రాష్ట్రంలోనే బాదేపల్లి మార్కెట్‌లో అధిక ధరలు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఆర్‌ఎన్‌ఆర్ రకం ఎక్కువగా సాగవుతున్నది. నాన్ డయాబెటిక్, సన్నగా ఉండటం, బీపీటీ(సోన)లేకపోవడంతో తెలంగాణ సోనకు డిమాండ్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మండపేట, మిర్యాలగూడ తదితర ప్రాంతాలకు ఇక్కడి ధాన్యం ఎక్కువగా ఎగుమతి అవుతున్నది. దీంతో మార్కెట్‌లో సన్నరకాలకు ధరలు బాగా వస్తున్నాయి.
పోటాపోటీగా ధరలు పెరుగుతున్నయ్..
రైతులు ధాన్యాన్ని బాగా ఆరబెట్టి, చెత్తాచెదారం లేకుండా నాణ్యతగా తీసుకొస్తే అధిక ధరకు అమ్ముకోవచ్చు. సన్నరకాల వడ్లకు మార్కెట్‌లో డిమాండ్ ఉండడంతో వ్యాపారులు పోటీపడి ధరలు పెంచేస్తున్నారు. రైతులకు లాభం కలుగుతున్నది. ఆంధ్రాలో తుఫాను ప్రభావం వల్ల పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ధాన్యం ధరలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇంత ధర వస్తదనుకోలే..
సన్నరకాలకు ఇంత ధర వస్తుందని అనుకోలేదు. మూడున్నర ఎకరాల్లో ఆర్‌ఎన్‌ఆర్ సన్నరకం ధాన్యం సాగుచేశా. దాదాపు 120 బస్తాలకు పైగా ధాన్యం పండింది. నేను తీసుకొచ్చిన ధాన్యానికి క్వింటా రూ.3,340ధర వచ్చింది. ఈ సారి వరిచేనుకు ఎలాంటి తెగుళ్లు లేకపోవడంతో మంచి దిగుబడి వచ్చింది. వర్షాలు లేకున్నా గత ప్రభుత్వం 24గంటల కరెంటు ఇవ్వడంతో పంటలు మంచిగ పండినయి.
సాగు ఖర్చులు పోనూ లాభమే..
ధాన్యానికి ఇంత పెద్ద మొత్తంలో ధరలు ఉంటే రైతులు బాగుపడుతారు. సాగుఖర్చులు పోను లాభం వస్తున్నది. నేను చూసిన కాలంలో ఎన్నడూ ఇంతటి ధర రాలేదు. నేను తీసుకొచ్చిన ధాన్యానికి రూ.3,230 ధర రావడం ఆనందంగా ఉంది. వ్యవసాయంపై ఆధారపడే రైతులకు గిట్టుబాటయ్యే ధరలు వచ్చేలా చూడాలి. గత ప్రభుత్వం సాగునీరు, కరెంటు ఇవ్వడంతో సాగు మంచిగైంది.
👉 – Please join our whatsapp channel here –