Politics

ఇంతకీ ఈ విజిటర్ పాస్ ఏంటి?

ఇంతకీ ఈ విజిటర్ పాస్ ఏంటి?

బుధవారం ఇద్దరు దుండగులు పార్లమెంట్‌లో సృష్టించిన అలజడి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇద్దరు దుండగులు లోక్‌సభలోని సందర్శకుల గ్యాలరీ నుండి దూకి.. పసుపు రంగు గ్యాస్ డబ్బాలతో నానా రాద్ధాంతం సృష్టించారు. ఈ ఘటనతో భారీ భద్రతా లోపం బయటపడింది. అసలు వాళ్లు లోపలికి ఎలా వచ్చారు? ఆ గ్యాస్ డబ్బాల్ని ఎలా తీసుకొచ్చారు? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే.. ఒక ఎంపీ ద్వారా వాళ్లకు విజిటర్ పాస్‌లు అందాయనే సమాచారం వెలుగులోకి వచ్చింది.

లోక్‌సభ హ్యాండ్‌బుక్ ప్రకారం.. ఈ విజిటర్ పాస్ అనేది పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) అతిథుల కోసం జారీ చేస్తారు. ఒక రోజు ముందే సెంట్రలైజ్డ్ పాస్ ఇష్యూ సెల్ (CPIC)లో అందుబాటులో ఉన్న పసుపు దరఖాస్తు ఫారమ్స్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫారమ్‌లో ఎంపీ తరఫున వచ్చిన అతిథుల పూర్తి పేరు, తండ్రి/భర్త పేరు, వయస్సు, జాతీయత, పాస్‌పోర్ట్ నంబర్ (ఇది విదేశీ సందర్శకులకు మాత్రమే వర్తిస్తుంది), వృత్తి వివరాలు, (శాశ్వత) చిరునామా వంటి వివరాలను పొందుపరచాలి. అంతేకాదు.. ఫలానా విజిటర్ తనకు బాగా తెలుసని, అతని పూర్తి బాధ్యత తనదేనని రాసి ఉన్న సర్టిఫికెట్‌ని సైతం ఎంపీ అందించాలి.

హ్యాండ్‌బుక్ ప్రకారం.. విజిటర్స్ కార్డ్ కోసం అప్లికేషన్‌లో నలుగురికి మించి అతిథుల పేర్లు ఉండకూడదు. అంటే.. ఒక్కో ఎంపీకి నలుగురు చొప్పున విజిటర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. అలాగే.. విజిటర్ కార్డ్ తీసుకోవడానికి మునుపటి రోజు సాయంత్రం 4 గంటలకే CPICకి చేరుకోవాలి. అదే రోజు దరఖాస్తులపై విజిటర్స్ కార్డు కోసం CPIC వద్ద ఉన్న రెడ్ ఫారమ్స్‌ కొన్ని షరతులకు లోబడి జారీ చేయబడతాయి. ఒకవేళ ‘సేమ్-డే’ పాస్‌లు జారీ అవ్వాలంటే.. పార్టీ ద్వారా అధికారం పొందిన డిప్యూటీ లీడర్ లేదా పార్టీ విప్ ఎవరైనా దరఖాస్తు ఫారమ్‌లో అదే రోజు పాస్‌ల జారీని సిఫార్సు చేయాల్సి ఉంటుంది. విజిటర్ ఉద్దేశాన్ని కూడా సంబంధిత జాయింట్ సెక్రటరీకి తెలియజేయాలి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z