యువగళం విజయోత్సవ జైత్రయాత్ర సభకు తెదేపా (TDP) ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి 7 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలేపల్లిలో భారీ సభ ఏర్పాటు చేసేందుకు తెదేపా సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక రైళ్లు ఈ నెల 19న చిత్తూరు, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతపురం, ఆదోని, నెల్లూరు, మాచర్ల నుంచి ప్రారంభమై తర్వాతి రోజు విజయనగరం చేరుకోనున్నాయి. ఒక్కో రైలులో 1300 మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు అద్దెకు బస్సులను సమకూర్చాల్సిందిగా ఆర్టీసీ అధికారులకు ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు.
జైత్రయాత్ర విజయోత్సవ సభకు తెదేపా (TDP), జనసేన (Janasena) అధినేతలు చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తోపాటు బాలకృష్ణ ఈ సభకు హాజరుకానున్నారు. తెదేపా – జనసేన పొత్తు ప్రకటన చేసిన తర్వాత ఒకే వేదికపైకి చంద్రబాబు, పవన్ రానుండటం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి ఇరుపార్టీల శ్రేణులతో పాటు అభిమానులు భారీ ఎత్తున సభకు తరలివస్తారని అంచనా.
👉 – Please join our whatsapp channel here –