DailyDose

సీఎంకు ఇప్పుడు గుర్తొచ్చిందా?

సీఎంకు ఇప్పుడు గుర్తొచ్చిందా?

‘ప్రజలు అయిదేళ్ల పరిపాలనకు అధికారం ఇస్తారు. అందులో నాలుగున్నరేళ్లు ఏమీ చేయకుండా, ఎన్నికలకు ఆర్నెల్ల ముందు టెంకాయ కొడితే మోసమంటారు. అదే అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లకే టెంకాయ కొడితే చిత్తశుద్ధి అంటారు’

ఇన్ని సూక్తులు చెప్పిన ఆయనకు.. విశాఖపట్నం లైట్‌ మెట్రోరైలు ప్రాజెక్టు ఎన్నికలకు ముందే గుర్తుకొచ్చింది. నాలుగున్నరేళ్లు దీన్ని మర్చిపోయారు. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీని డీపీఆర్‌ను ఆమోదించారు. దీన్నిబట్టే సీఎంకు ఈ ప్రాజెక్టుపై ఎంత చిత్తశుద్ధి ఉందో స్పష్టమవుతుంది.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ జగన్‌కు విశాఖపట్నం లైట్‌ మెట్రోరైలు ప్రాజెక్టు గుర్తుకొచ్చింది. మొదట్లోనే ఈ పనులు ఆరంభిస్తే.. ఈ పాటికి మొదటిదశ అయినా పూర్తయ్యేది. ఇప్పుడు డీపీఆర్‌ని ఆమోదించడమంటే.. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించడమే. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద మెట్రోరైలు ప్రాజెక్టుకు రూ.14,309 కోట్లు అవుతుంది. ఇందులో రాష్ట్రప్రభుత్వ వాటా 20% కింద రూ.2,862 కోట్లు వెచ్చించాలి. రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రహదారుల గుంతలు పూడ్చేందుకు తట్ట మట్టి వేయలేని దుస్థితిలో ఉన్న జగన్‌ ప్రభుత్వం.. ఈ ప్రాజెక్టుకు నిధులు ఇస్తుందంటే నమ్మాలా? ఎన్నికలకు ముందు ఇటీవల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చినట్లే.. విశాఖలో లైట్‌ మెట్రోరైలు ప్రాజెక్టుకు ఇప్పుడు డీపీఆర్‌ని ఆమోదించి మమ అనిపిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

జగన్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక విజయవాడ, విశాఖలో మెట్రోరైలు ప్రాజెక్టులను అటకెక్కించారు. విశాఖలో పీపీపీ పద్ధతిలో 42.55 కిలోమీటర్ల పొడవున లైట్‌ మెట్రోరైలు ప్రాజెక్టును రూ.8,300 కోట్లతో గత ప్రభుత్వం ప్రతిపాదించింది. తర్వాత వచ్చిన జగన్‌ ప్రభుత్వం విశాఖపై ఎనలేని ప్రేమ కురిపించింది. ఆ నగరాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించింది. అదే అభిమానం మెట్రోరైలు ప్రాజెక్టుపై ఎందుకు చూపలేదు? ఈ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం పంపిన డీపీఆర్‌ తప్పితే.. మళ్లీ ఇప్పటివరకు ఏపీ నుంచి నివేదిక రాలేదని కేంద్రం లోక్‌సభలో పలుమార్లు ప్రకటించింది. నాలుగున్నరేళ్లలో సీఎం నాలుగుసార్లు కూడా మెట్రోరైలు ప్రాజెక్టుపై సమీక్షించిన దాఖలాల్లేవు. రాష్ట్రప్రభుత్వ వాటా సమకూర్చాల్సి ఉంటుందని ఇన్నాళ్లూ పక్కన పెట్టి, ఎన్నికలకు ముందు బయటకు తీశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రాజెక్టు పూర్తికి ఎనిమిదేళ్లు
ప్రతిపాదిత లైట్‌ మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణ పనుల పూర్తికి ఎనిమిదేళ్లు పడుతుంది. దశలవారీగా ప్రాజెక్టు పూర్తిచేయాలని ప్రతిపాదించారు. తొలిదశ పనులు పూర్తిచేసి మెట్రోరైలు పట్టాలెక్కాలన్నా కనీసం మూడేళ్లు అవసరం.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z