విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఇరాన్ (Iran) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, గల్ఫ్ ప్రాంతం సహా 33 దేశాల పర్యాటకులు వీసా అవసరంలేకుండా తమ దేశంలో పర్యటించవచ్చని ఇరాన్ ప్రకటించింది. ఇప్పటికే తుర్కియే, అజర్‌బైజాన్, ఒమన్, చైనా, అర్మేనియా, లెబనాన్, సిరియా దేశాల పర్యాటకులకు వీసా నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో వీసా అవసరం లేకుండా ఇరాన్‌లో పర్యటించే అవకాశమున్న దేశాల సంఖ్య 45కి చేరింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ సమాజం పట్ల ఇరాన్ వైఖరికి నిదర్శనమని ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి ఎజ్జతొల్లా జర్ఘామి (Ezzatollah Zarghami) చెప్పినట్లు అధికారిక వార్తా సంస్థ ఐర్నా (IRNA) పేర్కొంది.
‘‘ఈ రోజు జరిగిన సమావేశంలో ఇరాన్ ప్రభుత్వం 33 దేశాల పర్యాటకులకు వీసా నిబంధనలను సడలించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల పర్యాటకులను ఆకర్షించేందుకు ఇరాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ సమాజానికి ఇరాన్ పట్ల ఉన్న ఆలోచనా ధోరణిని ఇది మారుస్తుందని నమ్ముతున్నాం’’ అని జర్ఘామి తెలిపారు. ప్రస్తుతం భారత్ నుంచి దౌత్య వ్యవహారాల కోసం ఇరాన్ వెళ్లే వారికి మాత్రమే వీసా అనుమతి నుంచి మినహాయింపు ఉంది. తాజాగా పర్యాటకులను ఈ జాబితాలో చేర్చడం గమనార్హం. గత కొద్దినెలలుగా పలు దేశాలు భారత పర్యాటకులకు వీసా మినహాయింపులును ఇస్తున్నాయి. శ్రీలంక, మలేషియా, థాయ్‌లాండ్, కెన్యాలు ఇప్పటికే భారత పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీని కల్పించగా.. తాజాగా ఇరాన్ ఆ జాబితాలో చేరింది.
👉 – Please join our whatsapp channel here –