తుంటి ఎముక సర్జరీ చేయించుకుని కోలుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ కాసేపటి క్రితం యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయి బంజారాహిల్స్‌లోని నందినగర్‌లోని ఆయన పూర్వ నివాసానికి వెళ్లారు. కేసీఆర్ కొద్దిరోజుల పాటు నందినగర్‌లోని ఇంట్లోనే ఉండనున్నారు. సర్జరీకి సంబంధించి డాక్టర్లకు అందుబాటులో ఉండాలన్న కారణంతోనే కేసీఆర్ గజ్వేల్‌లోని తన ఫామ్‌హౌజ్‌కు వెళ్లకుండా నందినగర్‌లోని ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది.
తొమ్మిదిన్నర ఏళ్ళ తర్వాత నందినగర్‌లోని సొంత ఇంటిలో కేసీఆర్ బస చేయనున్నారు. నందినగర్ ఇంటిని 2000 సంవత్సరంలో నిర్మించారు. 2021 జులై 13న ఇంటి మరమ్మతు పనులను కేసీఆర్ పరిశీలించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ ఇంటి నుంచే కేసీఆర్ కార్యాచరణ రూపొందించారు. తొమ్మిదిన్నరేళ్ల తర్వాత సొంత ఇంటికి కేసిఆర్ వస్తుండడంతో పూలదండలతో అలంకరించిన కుటుంబ సభ్యులు ఉదయమే ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌజ్ బాత్‌రూమ్‌లో జారిపడడంతో తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. వెంటనే ఆయనను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఆయనకు తుంటి ఎముకు రిప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత వారంరోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్న ఆయనను శుక్రవారం వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆపరేషన్ కారణంగా కేసీఆర్ అసెంబ్లీలో ఇంకా ఎమ్మెల్యేగా కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు.
👉 – Please join our whatsapp channel here –