DailyDose

సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు

సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు

మార్గదర్శికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన రెండు కేసులను ఆ రాష్ట్ర హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ దాఖలు చేసిన కేసుల్లో సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఫిబ్రవరి 2లోపు సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ ఈ కేసులపై ఏపీ హైకోర్టులో తదుపరి విచారణ చేపట్టరాదని నిర్దేశించింది. ఈ మేరకు జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓక, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. చిట్‌ఫండ్‌ యాక్ట్‌-1982 కింద చిట్‌ఫండ్‌ లావాదేవీలు నిర్వహించే సంస్థకు ఏపీ డిపాజిటర్స్‌ యాక్ట్‌ 1999లోని నిబంధనలు వర్తిస్తాయా? ఏపీ డిపాజిటర్స్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 5 వర్తించేలా చిట్‌ఫండ్‌ కార్యకలాపాల నిర్వహణలో మార్గదర్శి ఏమైనా విఫలమైందా అనే అంశాలపై తెలంగాణ హైకోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో అవే అంశాలపై ఏపీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను తెలంగాణ హైకోర్టుకు దాఖలు చేయాలని మార్గదర్శి ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్లు వేసింది. వాటిపై శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 139ఎ(2), సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 406 కింద ఉన్న నిబంధనలను అనుసరించి న్యాయం కోసం ఏదైనా కేసును ఒక హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు బదిలీ చేసే అధికారం సుప్రీం కోర్టుకు ఉన్నందున ఏపీ నుంచి ఈ రెండు కేసులను తెలంగాణకు మార్చాలని మార్గదర్శి తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఏపీ సీఐడీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్లను తిరస్కరిస్తూ విశాఖపట్నం స్పెషల్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు సెషన్స్‌ జడ్జి ఉత్తర్వులను జారీ చేసినట్లు, ఆ ఆదేశాలను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేసినట్లు ధర్మాసనానికి నివేదించారు. ఒకే ఎఫ్‌ఐఆర్‌ ద్వారా ఉత్పన్నమైన అంశాలపై దాఖలైన కేసులను రెండు హైకోర్టులు విచారించడం సముచితం కాదు కాబట్టి ఏపీ హైకోర్టులో పెండింగ్‌లో కేసులనూ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరారు. ఒకే ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన కేసులన్నీ ఒకేచోట విచారించేలా వీలు కల్పించాలని కోరారు. దీనివల్ల విభిన్న విచారణలు, విరుద్ధమైన తీర్పులను పరిహరించడానికి వీలవుతుందని తెలిపారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓక ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఈ రెండు అప్పీళ్లపై ఏపీ హైకోర్టులో విచారణ చేపట్టకూడదని ఆదేశించారు. విచారణను ఫిబ్రవరి 2కి వాయిదా వేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z