అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం మరోసారి నోటీసులు జారీచేసింది. దర్యాప్తు సంస్థకూ నోటీసులిచ్చింది. గతంలో జారీచేసిన నోటీసులు అందకపోవడంతో ఈ చర్య తీసుకుంది. జగన్‌పై నమోదైన సీబీఐ, ఈడీ కేసులను 2024 ఎన్నికల్లోగా తేల్చేలా ఆదేశాలివ్వాలంటూ మాజీ ఎంపీ, కాపు సంక్షేమసేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నేరచరిత్ర లేని నేతను ఎన్నుకోవాలని ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నా.. ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రస్తుతం జగన్ సీఎం అయ్యారన్నారు. ఈ పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం నవంబరు 8న ప్రతివాదులైన జగన్‌కు, సీబీఐకి నోటీసులు జారీచేసింది.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలు వినిపిస్తూ ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీచేసినా న్యాయవాదులెవరూ హాజరుకాలేదని తెలిపారు. అనుమతిస్తే వ్యక్తిగతంగా నోటీసులు అందజేస్తానని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ కోర్టు జారీచేసిన నోటీసులు అందకపోవడంతో మరోసారి జారీ చేస్తామని, వ్యక్తిగత నోటీసులు అందజేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. జగన్‌కు, సీబీఐకి నోటీసులు జారీచేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుమోటోగా తీసుకున్న పిటిషన్‌తో పాటు మూడు నెలల తర్వాత విచారణ చేపడతామని వాయిదావేసింది.
హైకోర్టులో పిటిషన్లపై విచారణ ఏ దశలో ఉందో చెప్పండి
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ, ఈడీ నమోదుచేసిన కేసుల్లోని నిందితులు హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్లపై విచారణ ఏ దశలో ఉందో చెప్పాలని సీబీఐ, ఈడీలతో పాటు పిటిషనర్ తరఫు న్యాయవాదులకు సీబీఐ ప్రధానకోర్టు న్యాయమూర్తి సీహెచ్.రమేశ్‌బాబు ఆదేశాలు జారీచేశారు. ఏవైనా పిటిషన్లు ఉన్నాయా, వాటిలో స్టే ఉందా అనే వివరాలు సమర్పించాలన్నారు. జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏషియా లిమిటెడ్‌ల వాల్యూ నివేదికల కాపీలను అందజేయాలని జగన్ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డికి ఆదేశాలు జారీచేశారు. ఈ కేసుల్లో దాఖలైన సుమారు 130 దాకా డిశ్ఛార్జి పిటిషన్లపై వాదనలు ముగిశాయి. వీటిపై తదుపరి విచారణను జనవరి 5వ తేదీకి వాయిదా వేశారు.
👉 – Please join our whatsapp channel here –