ఎప్పుడో 14ఏళ్ల కిందట 2009లో తానా ప్రవాస విద్యార్థి సేవల విభాగ అధ్యక్షుడిగా సంస్థలోకి అడుగిడినప్పటి నుండి నేటి వరకు తానా పేరిట తాను చేసిన సేవా, సహాయ కార్యక్రమాలు గోరంతేనని…చేయవల్సినది, చేయగలిగినది కొండంత మిగిలి ఉందని ప్రకాశం జిల్లా కొల్లావారిపాలెంకు చెందిన ప్రవాసాంధ్రుడు తానా కోశాధికారి కొల్లా అశోక్‌బాబు పేర్కొన్నారు. తానా సంస్థ పరిధి, శక్తిసామర్థ్యాలు పూర్తి స్థాయిలో వినియోగించబడట్లేదని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. #visionTANA పేరిట #teamVEMURI ప్యానెల్ నుండి 2023 ఎన్నికల్లో కార్యదర్శిగా పోటీగా చేస్తున్న అశోక్ తాను చేపట్టిన కార్యక్రమాలే కరపత్రంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. TNIతో ఆయన ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వివరాలు…
నేటికీ ప్రతిరోజు పొలం పనులకు వెళ్లే రైతాంగ కుటుంబం నుండి వచ్చిన తనకు కష్టించి పనిచేయడం, కష్టాల్లో ఉన్నవారి కోసం పనిచేయడం ఆనందం ఇస్తుందని అశోక్ అన్నారు. తానా సభ్యులకు వివాహ సంబంధ సేవలు, ప్రవాస తెలుగు పర్యాటకులకు బీమా సౌకర్యం, తానా సభ్యులకు అమెరికావ్యాప్తంగా పలు వ్యాపార సంస్థల్లో రాయితీ సౌలభ్యం, ప్రవాస యువతీయువకులకు విద్యాపరమైన సేవలు, మాతృదేశంలో శాశ్వత సేవా కార్యక్రమాల నిర్వహణకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. #visonTANA లక్ష్యంలో భాగంగా తానాకు పలు అంతర్జాతీయ సంస్థలకు మధ్య ఒప్పందాలు కుదుర్చుకుని భావితరాల వారికి ఉపయుక్తమయ్యే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
సేవా కార్యక్రమాల నిర్వహణలో ఉండాల్సిన పోటీ కోర్టు కేసుల్లో కనపడటం దురదృష్టకరమని అశోక్ అన్నారు. ఒకరి కష్టార్జితం మరొకరి బాగుకోసం వెచ్చించాల్సిన బరువైన బాధ్యత కలిగిన తానా కోశాధికారిగా తాను సమర్థవంతంగా పనిచేశానని వెల్లడించారు. తానా ఖజానా కొందరికి బంగారు బాతుగా మారిందని…కల్తీ లెక్కలు, నకిలీ పత్రాలతో చెదపురుగుల మాదిరి లోపల నుండి సంస్థ నిధులు మింగిన వారందరి నుండి ప్రతిపైసా తిరిగి రప్పిస్తామని…ఇప్పటికే ఈ లక్ష్యం తొలివిజయాన్ని నమోదు చేసిందని పేర్కొన్నారు.
అమెరికాలో దురదృష్టమో, దుర్ఘటనో బారిన పడిన ప్రవాస తెలుగువారికి TANA-TEAMSQUARE ద్వారా అశోక్ రూపంలో ఓ ఆశాకిరణం నేనున్నాననే భరోసానిచ్చింది. గడిచిన 14ఏళ్లలో ఆపన్నులకు ఆసరాగా, బాధితులకు బాసటగా, సేవా కార్యక్రమాలకు సదా సంసిద్ధుడిగా పనిచేసిన తనకు తానా ద్వారా మరిన్ని దీర్ఘకాల సమాజాహిత కార్యక్రమాలు నిర్వహించాలనే సదాశయానికి గొడుగు పట్టాలని తానా సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. తానా ఓటర్లు తమ ఓటును తనకు, తన ప్యానెల్‌కు అందజేసి 2023 ఎన్నికల్లో గెలిపించవల్సిందిగా కోరారు.
—సుందరసుందరి(sundarasundari@aol.com)
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z